ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు లాబీయింగ్ మొదలైందా.?

2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విషయమై చంద్రబాబు నానా తంటాలూ పడుతున్నారు. రాష్ట్రంలో అధికారం దక్కితే సరిపోదు.. కేంద్రం నుంచీ సహకారం వుండాల్సిందే. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ అవకుండా వుండాలనే కోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పక్కా వ్యూహంతో ఈసారి తన వేగుల్ని ఢిల్లీకి పంపించారట, బీజేపీ అధిష్టానంతో లాబీయింగ్ కోసం.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడకు వచ్చిన దరిమిలా, బీజేపీలోని తన అనుకూలురుతో ఆయన్ని ఒప్పించేందుకు ఓ వైపు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ అధినేత, ఏకకాలంలో ఢిల్లీలోనూ తన వేగుల ద్వారా బీజేపీ పెద్దలతో మంతనాలు షురూ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ అనుకూల మీడియాకి చెందిన పెద్దలు కూడా, బీజేపీ జాతీయ నాయకత్వంతో రాష్ట్రంలో రాజకీయ పరిణమాల గురించి చర్చిస్తున్నారట, తమవైన నివేదికలూ అందిస్తున్నారట. టీడీపీని బతికించేందుకు ఆ మీడియా సంస్థల అధిపతులు చేస్తున్న ప్రయత్నాలు, పడుతున్న పాట్లూ అన్నీ ఇన్నీ కావు.

‘ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ మాత్రమే వుండాల్సి వస్తే..’ అన్న కోణంలో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చేశారనీ, ఆ నిర్ణయాన్నీ బీజేపీ పెద్దలకు సమాచారం రూపంలో పంపారనీ చెబుతున్నారు.

చంద్రబాబుకి జాతీయ రాజకీయాలపై మక్కువ పెరిగింది. ‘జాతీయ నాయకుడు’ అని ఇంకోసారి అన్పించుకోవాలని చంద్రబాబు తపన పడుతున్నారు. సో, ముఖ్యమంత్రి పదవిపై చంద్రబాబు ఆశలు వదిలేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, బీజేపీ ఏమనుకుంటోందో చంద్రబాబు విషయంలో.?