నవరాత్రి రంగులు.. సినిమా సంబరాలు.!

Navaratri Colours Telugu Cinema Celebrations Started | Telugu Rajyam

తెలుగు సినిమాకి సంక్రాంతి పెద్ద సీజన్. తర్వాత సమ్మర్. సంక్రాంతి తర్వాత అలాంటి పెద్ద పండగ దసరా. ఈ సీజన్లలో పెద్ద సినిమాలూ, చిన్న సినిమాలూ అనే తేడా లేకుండా రిలీజ్ కోసం వరుస సినిమాలు క్యూ కడుతూ ఉంటాయి. అయితే, కరోనా నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా వెలవెలబోయిన తెలుగు సినిమాకి ఈ ఏడాది దసరా కొత్త ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఈ దసరాకి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

యంగ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కాంబినేషన్‌లో ‘మహా సముద్రం’ సినిమా దసరా కానుకగా రిలీజైంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటూ అక్కినేని కుర్రోడు అఖిల్ రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు. అలాగే, దర్శక రత్న రాఘవేంద్రరావు తన మార్క్ సినిమా ‘పెళ్లి సందడి’ని దసరా సీజన్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఇలా ఇన్నాళ్లూ కళ తప్పిన ధియేటర్లు కొత్త కళను సంతరించుకుంటున్నాయి ఈ దసరా సినిమాలతో. ధియేటర్ల సందడి ఇలా ఉంటే, మరో పక్క ఓటీటీ ఛానెళ్లు కూడా దసరా సీజన్‌తో కొత్త రంగులు అద్దుకుంటున్నాయి. టాప్ ఓటీటీ ఛానెల్ అయిన ‘ఆహా’లో బాలయ్య టాక్ షో అంటూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి, బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ నుంచి ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి, నవరాత్రికి సినిమా తరపున సరికొత్త రంగులద్దారు. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా నుండి మోషన్ పోస్టర్ కూడా దసరా కానుకగా రిలీజ్ చేశారు.

దసరా సిట్యువేషన్‌కి తగ్గట్లుగా కలకత్తా కాళీమాత బ్యాక్ డ్రాప్‌లో ఉన్నఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కూడా కొత్త అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అనూహ్యమైన సినీ అప్డేట్స్‌తో ఈ దసరా సీజన్ సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles