ప్రతి ఇంటికీ జాతీయ జెండా.! రైటా.? రాంగా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలోని ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలన్నది కేంద్రం చెబుతోన్న విషయం. నిజానికి, ఇది మంచి కార్యక్రమమే.

ఇంటింటికీ జాతీయ జెండా ఇచ్చేలా వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని కూడా అభినందించి తీరాల్సిందే. కానీ, జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలపై దేశంలో ఎంతమందికి అవగాహన వుంది.? జెండా ఎగురవేయడం, ఆ తర్వాత ఆ జెండాని కిందికి దించి, జాగ్రత్త చేయడం.. వీటిపై ఎంతమంది అవగాహన కలిగి వున్నారు.?

దేశవ్యాప్తంగా ఈ విషయమై బోల్డంత చర్చ జరుగుతోంది. కొన్నాళ్ళ క్రితం సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన అంశం పెద్ద రచ్చకు తావిచ్చింది. కొంతమంది జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిల్చోకపోవడంతో థియేటర్లలలో గొడవలు జరిగాయి.

మరి, ఇప్పుడు జాతీయ జెండాని ఎగురవేసే క్రమంలో నిబంధనల్ని ఎవరైనా పాటించకపోతే ఏంటి పరిస్థితి.? అప్పుడు గొడవలు జరిగితే ఎవరు బాద్యత వహిస్తారు.? ప్రతి ఇంటిపైనా జెండా.. అనడం కంటే, ప్రతి కాలనీలోనూ జెండా పండుగ అధికారికంగా నిర్వహించగలిగితే, సమస్యలు వుండవు.

దేశభక్తి అనేది గుండెల్లో దాగి వుండాలి. అవసరమైనప్పుడు ఆ దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటగలగాలి. అంతేగానీ, ఇలా పబ్లిసిటీ స్టంట్లతోనే దేశభక్తి.. అంటే అదెంతవరకు సబబు.?