దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఇత‌నే..!

Congress

 తెలంగాణ దుబ్బాక ఉపపోరు నవంబర్ 3 న జరగనుంది. తెరాస సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీనితో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని రంగంలోకి దిగాయి. ఇప్పటికే బీజేపీ పార్టీ తరుపున రఘునందన్ రావు దాదాపుగా ఖరారు అయ్యినట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ నుండి నర్సారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

narsareddy telugu rajyam

  సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడిగా ఉంటున్న నర్సారెడ్డిని దుబ్బాక ఉప పోరులో నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి పోటీకి సుముఖంగా లేకపోవడంతో నర్సారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. నర్సారెడ్డి అయితేనే అన్నివిధాలా బావుంటుందనే కాంగ్రెస్ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్నీ ఈ రోజు అధికారంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దుబ్బాక ఉపపోరులో ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణికం టాగోర్ ఇక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. ప్రతి రెండు గ్రామాలకు ఒక రాష్ట్రస్థాయి నేతను నియమించి ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి లో కీలక కాంగ్రెస్ నేతలు అందరు కూడా దుబ్బాక ఉపపోరులో పాల్గొంటున్నారు.

  మరోపక్క బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని చూస్తుంది, ఇందులో విజయం సాధించకపోయినా తెరాసకి గట్టిపోటీ ఇచ్చి అధికార తెరాసకి తామే సరైన పోటీదారులమని నిరూపించుకోవాలని వుంది. రఘునందన్ రావు గత కొన్నేళ్లుగా దుబ్బాక కేంద్రంగా పనిచేస్తూ సొంత క్యాడర్ ని బాగానే ఏర్పాటు చేసుకున్నాడు, అదే ఇప్పుడు ఆయనకు బాగా కలిసివచ్చే అవకాశం వుంది. మరోపక్క తెరాస మాత్రం తమ స్థానాన్ని ఎలాగైనా తిరిగి సాధిస్తామనే గట్టి నమ్మకంతో వుంది, ఇప్పటికే తెరాస పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావు దుబ్బాకలో మకాం పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే తెరాస తరుపున ఎవరు పోటీచేస్తారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రామలింగ రెడ్డి భార్య లేదా, ఆయన కొడుకు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తుంది. నవంబర్ 3 న పోలింగ్ , నవంబర్ 10 న కౌంటింగ్ జరగనుంది.