విక్టరీ వెంకటేష్ ఎంతో ఇష్టపడి చేసిన చిత్రం ‘నారప్ప’. ‘అసురన్’ చూడగానే రీమేక్ చేయాలని నిర్ణయించుకున్న వెంకటేష్ వెంటనే సురేష్ బాబును రంగంలోకి దింపి రీమేక్ రైట్స్ కనిపించేశాడు. ఆ తర్వాత దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలను ఎంచుకుని వెంటనే షూటింగ్ మొదలుపెట్టేశాడు. వెంకటేష్ షూటింగ్ చేసిన విధానం చూస్తే సినిమా మీద ఆయన ఎంతలా ప్రాణం పెట్టుకున్నారో తెలుస్తుంది. మేకోవర్ దగ్గర్నుండి సన్నివేశాల చిత్రీకరణ వరకు ప్రతి విషయంలోనూ 100 శాతం పర్ఫెక్షన్ చూపించారు. ఒక్కో సన్నివేశాన్ని ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాతో ఆయన నటుడిగా పూర్తి సంతృప్తి పొందారు. ప్రేక్షకుల ముందుకు సినిమాను ఎప్పుడెప్పుడు తీసుకొద్దామా అనే ఆతురుతలో ఉన్నారు ఆయన.
చకా చకా అన్ని పనులు పూర్తిచేస్తున్న సమయానికి లాక్ డౌన్ పడింది. మొదటి లాక్ డౌన్ ముగిశాక మళ్లీ రీస్టార్ట్ చేసినా చివరి దశ పనులకు రెండవ లాక్ డౌన్ అంతరాయంగా నిలిచింది. ఎలాగో ప్యాచ్ వర్క్ ఫినిష్ చేసిన టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ ముగించారు. ఇంకొద్దిరోజుల్లో సినిమా పూర్తవుతుంది. అందుకే సినిమా హాళ్లు తెరుచుకునే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు వెంకటేష్. సినీ వర్గాల సమాచారం మేరకు జూన్ ఆఖరుకు 50 శాతం జూలై నెలలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే 100 శాతం ఆక్యుపెన్సీ వస్తుందో అప్పుడు వెంటనే సినిమాను విడుదల చేయాలని వెంకటేష్ అనుకుంటున్నారట.