Nara Lokesh : నారా లోకేష్ తన నియోజకవర్గాన్ని మార్చుకోక తప్పదా.?

Nara Lokesh :  2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్, 2024 ఎన్నికల్లో మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా.? లేదా.? అన్నదానిపై ఎప్పటికప్పుడు చర్చోపచర్చలు జరుగుతూనే వున్నాయి.

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమంత బాగా లేదు. రాజధాని అమరావతి పరిధిలోనే మంగళగిరి వుంది. ఆ రాజధానిలోనే రైతుల సెగ కారణంగా అధికార పార్టీ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నమాట వాస్తవం. అయినాగానీ, టీడీపీకి అది ఎడ్జ్ కాలేకపోతోందట. కారణం, నారా లోకేష్ పట్ల ప్రజల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడమేనంటున్నారు.

లోకేష్ మాత్రం, మంగళగిరి నుంచే మళ్ళీ పోటీ చేస్తానని కుండబద్దలుగొట్టేస్తున్నారు. కాగా, 2024 లేదా అంతకన్నా ముందే ఎన్నికలు వచ్చినా.. సర్వసన్నద్ధంగా వుండాలంటూ పార్టీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టంగా దిశా నిర్దేశం చేసేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుని, అధినేతకు నివేదికలు ఇచ్చే పనుల్లో బిజీగా వున్నారు.

మంగళగిరి కంటే గన్నవరం నియోజకవర్గమైతేనే నారా లోకేష్‌కి బావుంటుందన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఒకింత సానుకూలంగానే వున్నారట. 2019 ఎన్నికల్లో గన్నవరం సీటుని టీడీపీ గెలుచుకున్నా, ఆ పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, ఆ తర్వాత వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.