నారా లోకేష్ పాదయాత్రని సాఫీగా సాగనిస్తారా.?

కొన్నాళ్ళ క్రితం అమరావతి రైతులు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్రను నిర్వహిస్తామంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఆంక్షలు విధించారు. పాదయాత్రపై రాళ్ళు రువ్వే ఘటనలు ఎదురు కావొచ్చంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, ఆ పాదయాత్ర సజావుగా సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు, పోలీసు వ్యవస్థ ఎలా వున్నాయనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

ఒకప్పుడు.. అంటే, 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదరశి, ఎమ్మెల్సీ నారా లోకేష్ త్వరలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న దరిమిలా, వైఎస్ జగన్ సర్కారు ఆ పాదయాత్రను సజావుగా సాగనిస్తుందా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇటీవలి కాలంలో చిన్న చిన్న ఘటనలూ వివాదాస్పదమవుతున్నాయి. కోనసీమ అల్లర్ల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ప్రెస్ మీట్లలోనే నాయకులు బూతులు తిట్టుకుంటున్నారు. అంతేనా, నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళతామంటూ అధికార పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ పాదయాత్ర అంటే అంత తేలికైన వ్యవహారం కానే కాదు.

పోలీసులు అనుమతులు మంజూరు చేయడమూ కష్టమే. అనుమతులొస్తే, ఆంక్షలూ ఎక్కువగానే వుంటాయ్. అప్పటికీ ఇప్పటికీ రాజకీయం చాలా మారింది. అయితే, పాదయాత్ర అనేది రాజకీయ నాయకులకు రాజకీయంగా సంక్రమించిన హక్కు అనాలేమో. పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందని గతంలో రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత చంద్రబాబు.. మొన్నీమధ్యనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నిరూపితమయ్యింది.

నారా లోకేష్ కూడా అదే ఆశతో పాదయాత్రకు సిద్ధమవుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత తేలికైన వ్యవహారం కాదు.!