టీడీపీలో కొత్త జోష్ నింపిన లోకేష్ ‘పోలవరం’ టూర్.!

పోలవరం ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నడిచిన ‘అలసత్వం’ సంగతి పక్కన పెడితే, పోలవరం ప్రాజెక్టు బాధితులకు బాసటగా నిలిచేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పర్యటన రాజకీయంగా తెలుగు తమ్ముళ్ళలో కొత్త ఉత్సాహం నింపుతోంది. నిజమే మరి, గోదావరి నదికి ఇటీవల పోటెత్తిన వరద నేపథ్యంలో, ప్రాజెక్టు ముంపు బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అదంతా ఓ సమస్య. ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందించాల్సిన సాయం సరిగ్గా అందకపోవడం ఇంకో సమస్య. నిజానికి, వీళ్ళని పోలవరం ప్రాజెక్టు బాధితులుగా కాకుండా.. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసినవారిగా గుర్తించాలి. ఏ ప్రాజెక్టు విషయంలో అయినా అంతే. కానీ, అధికారంలో ఎవరున్నా.. ప్రాజెక్టులు కట్టడం మీదున్న శ్రద్ధ.. ముంపు బాధితుల పునరావాసం మీద వుండదు. పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఈ సమస్య మరీ ఎక్కువ.

వందల్లో, వేలల్లో లక్షల్లో బాధితులు వున్నప్పుడు, ఆ సమస్యను సరైన రీతిలో అడ్రస్ చేసి తీరాలి. ఈ అంశంపై మంత్రులు పలుమార్లు బాధితులతో మాట్లాడినా, సాయం అందించాల్సిన రీతిలో అందించకపోవడంతో సమస్య తీవ్రత పెరిగిపోతోంది. అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంటి.? భవిష్యత్తు ఏంటి.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నా.. వరద రాజకీయం మాత్రం అనూహ్యంగా నడుస్తోంది.. అధికారంలో ఎవరున్నాసరే. ‘జగన్… భయపడి ఇంట్లో దాక్కున్నారు..’ అంటూ నారా లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారానికి కారణమవుతున్నాయి. వైసీపీ తరఫున, ప్రభుత్వం తరఫున పలువురు ధీటైన సమాధానమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, లోకేష్ ఘాటైన విమర్శల ముందు అవన్నీ తేలిపోతున్నాయి. ప్రభుత్వాన్ని సమర్థించే రీతిలో వ్యవహరించాల్సిన నాయకులే వైసీపీకి కరవయ్యారా.? అదే లోకేష్‌కి అడ్వాంటేజ్ అయ్యిందా.? అన్న చర్చ నడుస్తోందిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో.