నారా లోకేష్ సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్.. కానీ, ఎందుకు.?

గుంటూరులో దళిత యువతి రమ్య దారుణ హత్యకు గురైన ఘటన అందర్నీ కలచివేస్తోంది. నిందితుడ్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల్ని ప్రకటించడమే కాదు, స్వయంగా హోంమంత్రి సుచరిత, చెక్కుని బాధిత కుటుంబానికి అందించారు కూడా. ఇదిలా వుంటే, బాధిత కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. వారికి అండగా వుంటామంటూ టీడీపీ నేతలు హంగామా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మరికొందరు టీడీపీ నేతలు, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతల మధ్య గలాటా చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పలువురు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు.

అరెస్టయినవారిలో నారా లోకేష్ కూడా వున్నారు. అసలు టీడీపీ నేతల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసినట్లు.? అంటే, టీడీపీ – వైసీపీ నేతలు, కార్యకర్తల రెచ్చగొట్టే చర్యలతో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పే అవకాశం వుంది గనుక.. అన్నది పోలీసుల వెర్షన్. కానీ, కేవలం టీడీపీకి చెందినవారినే అరెస్ట్ చేశారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నమాట. కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారంటూ టీడీపీ నుంచి ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అసలు ఇలాంటి విషయాల్లో, పోలీసులు అరెస్టులదాకా ఎందుకు వెళతారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దకపోతే, పోలీసు వ్యవస్థ వైఫల్యం.. అని ఇదే టీడీపీ ఎదురుదాడికి దిగుతుంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఇలాంటి హంగామానే చాలా సందర్భాల్లో నడిచింది. అయినా, రాజకీయ పార్టీలకు చెందిన నేతల అరెస్ట్.. అనేది రాజకీయాల్లో సర్వసాధారణమే మరి. అదో టైపు పబ్లిసిటీ స్టంట్ కూడా.