తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. అసహనంతో ఊగిపోతున్నారు. అసలాయనకు సంయమనం అన్న పదానికే అర్థం తెలియదా.? అన్నట్టుంది పరిస్థితి. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్ళిపోయింది. పంచాయితీ ఎన్నికల్లో అదరగొట్టేస్తున్నామని ఓ పక్క చెప్పుకుంటూనే, ఇంకోపక్క ‘ఇది వైసీపీ గెలుపు కాదు.. ప్రజాస్వామ్యం ఓడింది’ అంటున్నారు. ఏది నిజం.? పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొని టీడీపీ గట్టిగా నిలబడిందన్న నిన్న మొన్నటి చంద్రబాబు మాటలు నిజమా.? లేదంటే, తాజాగా ‘ప్రజాస్వామ్యం ఓడింది’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమా.? ప్రతిరోజూ చంద్రబాబు అండ్ టీమ్, పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ మద్దతుదారులంటూ పెద్ద లిస్టే విడుదల చేస్తోంది. అదంతా ఉత్త వ్యవహారమేనని తేలిపోయింది. గ్రామ స్థాయిలో టీడీపీ పునాదులు కదిలిపోయాయని పంచాయితీ ఎన్నికల ఫలితాలు నిరూపించేశాయి. చాలా చోట్ల టీడీపీ మూడో స్థానానికి పడిపోతే, రెండో స్థానంలోకి జనసేన వచ్చింది. జనసేన మద్దతుదారులకు వచ్చిన ఓట్లు చూస్తే, టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఎదిగిందనే అర్థం చేసుకోవాలేమో.
కొందరు కీలక వైసీపీ నేతల సొంత నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించిన దరిమిలా, వైసీపీ కూడా ఇకపై ఆ పార్టీ మీద ఓ కన్నేసి వుంచాలి. వైసీపీ, జనసేన సంగతి పక్కన పెడితే, టీడీపీ మాత్రం పంచాయితీ ఎన్నికల దెబ్బకు కుదేలైంది గనుక డ్యామేజీ కంట్రోల్ చర్యలు ప్రారంభించి తీరాల్సిందే. నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే చంద్రబాబు, ఇంకా పాత తరం రాజకీయాలు చేస్తానంటే కుదరదు. కానీ, ఆయనలో మార్పు రావడంలేదు. ఇలాగైతే, రాజకీయ సన్యాసం తప్ప చంద్రబాబుకి ఇంకో దారి లేదన్న వాదన రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల టీడీపీ తమ మద్దతుదారుల్ని నిలబెట్టేందుకోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వచ్చిందంటూ జరుగుతున్న ప్రచారం దరిమిలా, అంత ఖర్చు చేసినా ఫలితం లేకపోవడమంటే.. టీడీపీ ఇక కోలుకోవడం అసాధ్యమనే కదా అర్థం.!