నారా భువనేశ్వరి లేఖాస్త్రం.. వైసీపీకి నష్టమా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి బహిరంగ లేఖ విడుదల చేశారు. తన మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొందరు శాసన సభ్యులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు అండగా నిలబడ్డవారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసినవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి / తోబుట్టువుకి / కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మగారు, నాన్నగారు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాము. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాల్లో / ఆపదలో వున్నవారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా వుండాలని ఆశిస్తున్నాను..’ ఇదీ నారా భువనేశ్వరి రాసిన లేఖ సారాంశం.

నిజమే, నారా భువనేశ్వరి విషయంలో వైసీపీ శాసనసభ్యులు కొందరు అవమానకరంగా అసెంబ్లీలో వ్యవహరించారు. ‘మేము ఏమీ అనలేదు..’ అంటూ వైసీపీ నేతలు బుకాయించొచ్చుగాక. వాళ్ళేమన్నారో ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

అయితే, శాసనసభలో గుసగుసలాడుతున్నట్లుగా వినిపించిన ఆ వ్యాఖ్యల ప్రభావం కంటే, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లతో భువనేశ్వరి పేరు ప్రఖ్యాతులు బదనాం అయ్యాయన్న వాదనలున్నాయి.

నిజానికి, తెలుగుదేశం పార్టీ నేతలు.. సదరు శాసన సభ్యుల మీద కేసులు పెట్టి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేది. కేసులు పెట్టకుండా, కేవలం రాజకీయ పరమైన ఆరోపణలు చేయడానికే టీడీపీ పరిమితం కావడంతో, ఈ వ్యవహారంలో అధికార వైసీపీకి పెద్దగా డ్యామేజీ జరగలేదు. భువనేశ్వరి లేఖతో కూడా వైసీపీకి పెద్దగా నష్టం వుండకపోవచ్చు.