నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న గీతం యూనివర్సిటీ మీద ప్రభుత్వం పంజా విసిరిన సంగతి తెలిసిందే. అక్రమంగా ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని విశాఖ మున్సిపల్ అధికారులు గీతం నిర్మాణాలను కూలగొట్టిన సంగతి తెలిసిందే. ఆక్రమించుకున్న భూమి విలువ 800 కోట్ల వరకు ఉంటుందని, అందుకే కూల్చివేసి ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు హయాంలో ఎంవివిఎస్ మూర్తి ఈ ఆక్రమణలు చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు సహా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కావాలనే జగన్ ఈ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీభరత్ మామ బాలకృష్ణ రంగంలోకి దిగనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఇంతవరకు పార్టీకి సంబంధించినఈ కీలక విషయంలోనూ కలుగజేసుకోలేదు. పెద్ద పెద్ద వివాదాలను సైతం చూసీ చూడనట్టు వదిలేసేవారు. ఇన్నాళ్ళల్లో ఆయన జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసింది కూడ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్, బాలయ్యల నడుమ సమోధ్య వాతావరణం నడుస్తోందని అందరూ చెప్పుకుంటారు. జగన్ సైతం బాలయ్యకు వీరాభిమాని కాబట్టి ఆయన్ను ఇబ్బందిపెట్టే చర్యలేవీ తీసుకోరని, అవసరమైతే సహకరిస్తారని అనుకుంటుంటారు.
కానీ ఒక్కసారిగా ఇలా ఆయన అల్లుడి విద్యాసంస్థల మీద ప్రభుత్వం పట్టు బిగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాలుగు దశాబ్దాలుగా గీతం యూనివర్సిటీ పరిధిలో జరిగిన అన్ని కార్యకలాపాల మీద సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు కూడ ఉన్నాయట. అందుకే బాలయ్య రంగంలోకి దిగి అల్లుడిని సేవ్ చేసుకునే పని మొదలుపెడతారని అంటున్నారు. మరి ఈ సేవింగ్ ప్రక్రియలో బాలయ్య జగన్ తో సామరస్యంగా వెళతారా లేకపోతే కోర్టులకెక్కి స్టేలు తెచ్చుకుని ఛాలెంజ్ విసురుతారా అనేది తేలాలి. ఒకవేళ బాలయ్య పోరాటానికే గనుక దిగితే వివాదం మరింత ముదరడం ఖాయం.