దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర సమితికి అనూహ్యమైన రీతిలో షాకిచ్చింది. గులాబీ పార్టీ అస్సలేమాత్రం ఊహించలేదు దుబ్బాక ఓటమిని. మంత్రి హరీష్ రావు పూర్తి బాధ్యత తీసుకుని అలుపెరగక ప్రచారం నిర్వహించినా, చాలా తాయిలాలు ప్రభుత్వం దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రకటించినా.. అవేవీ గులాబీ పార్టీని కాపాడలేకపోయాయి. సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. మరి, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఏమవుతుంది.? అభ్యర్థిని ఖరారు చేయడానికే చాలా సమయం తీసుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ కుమార్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయబోతున్నారు. పార్టీ తరఫున ప్రచారం కోంస 28 లక్షల రూపాయల చెక్ అందజేశారు అభ్యర్థికి కేసీఆర్. రేపు నామినేషన్ అనంతరం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం కొత్త పుంతలు తొక్కబోతోంది. అయితే, దుబ్బాకలో హరీష్ రావు బాధ్యత తీసుకున్నట్లు నాగార్జున సాగర్ విషయంలో బాధ్యత తీసుకునేదెవరు.? ఈ విషయమై గులాబీ పార్టీలో మేధోమధనం గట్టిగానే సాగిందట.
మొత్తంగా అందరూ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మోహరించి, పార్టీ కోసం పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకి ఆదేశించారట. కాగా, నోముల భగత్ గనుక గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అంటున్నాయి గులాబీ శ్రేణులు. అయితే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. జానారెడ్డి విషయంలో నియోజకవర్గంలో సింపతీ ఎక్కువగానే వుంది. కాంగ్రెస్ పార్టీకి అక్కడ అంత సీన్ లేకపోయినా, జానా రెడ్డికి మాత్రం వుంది. దుబ్బాకలో బీజేపీ, గులాబీ పార్టీకి షాకిస్తే.. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి గెలిచి, కాంగ్రెష్ పార్టీ.. కారు పార్టీకి షాకివ్వబోతోందని అంటున్నారు.