దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘనవిజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అనూహ్య రీతిలో పుంజుకోవడంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం తామేనన్న రీతిలో చెలరేగిపోతోంది. ఇప్పటికే తర్వాతి సార్వత్రిక ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న కమల దళం ఈలోపు నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కూడ సత్తా చాటాలి చూస్తోంది. చూడటమేమిటి విజయం తమదే అంటోంది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే నాగార్జున సాగర్, దుబ్బాకల నడుమ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. మొదటి నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీదే డామినేషన్.
రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కూడ ఆధిక సంఖ్యలోనే ఉన్నారు. వారితో పాటు బీసీ ఓటర్లు మద్దతు కూడ కొంతమేర ఉండటంతో హస్తం పార్టీ వరుస విజయాలు సొంతం చేసుకుంది. 2009, 2014 ఎన్నికల్లో జానారెడ్డి గెలుపొందారు. కానీ గత ఎన్నికల్లో బీసీ ఓటర్లు పూర్తిగా తెరాసకు జైకొట్టడంతో నోముల నర్సింహయ్య గెలిచారు. ఇక బీజేపీకి ఈ ఎన్నికల్లో ఒకటిన్నర శాతం ఓట్ షేర్ కూడ దొరకలేదు. అంటే నాగార్జున సాగర్ మీద బీజేపీకి ఏమాత్రం పట్టులేదనేది సుస్పష్టం. కానీ ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ ఓట్ షేర్ కొంత మేర పెరిగే అవకాశం ఉంది. అలాగని ఏకంగా ఒకటిన్నర శాతం నుండి 50 శాతానికి వెళుతుందనుకుంటే అత్యాశే అవుతుంది.
ఈసారి కూడా బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి నిలబడుతున్నారు. ఎలాగైనా గెలవాలనే ప్రయత్నంలో ఉన్న ఆయన నాగార్జునసాగర్లోనే కాదు నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులన్నింటినీ యాక్టివ్ చేస్తున్నారు. సొంత క్యాడర్ ను కదుపుతున్నారు. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొత్త పీసీసీ చీఫ్ ఎంపికను కూడ వాయిదా వేసింది హైకమాండ్. ప్రధాన పోటీ అనేది తెరాస, కాంగ్రెస్ పార్టీల నడుమే ఉంటుంది. ఈ టఫ్ ఫైట్లో బీజేపీ నెగ్గుకురావడం అంత ఈజీ కాదు. దుబ్బాకలో పండిన సెంటిమెట్లు ఈసారి పండకపోవచ్చు. 50 శాతం వరకు ఉన్న బీసీ ఓటర్లు ఎంతవరకు కమలం పార్టీకి జైకొడతారనేది చెప్పలేం. తాజాగా బీజేపీ ఇక్కడ సర్వే చేయించుకుందని, అందులో నెగెటివ్ సూచనలే కనబడ్డాయనే ప్రచారం కూడ ఉంది. ఇన్ని ప్రతికూలతల నడుమ బీజేపీ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి.