తెలంగాణలో మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, దుబ్బాక గ్రేటర్ ఫలితాలు గాలివాటం కాదని నిరూపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంది.
నాగార్జున సాగర్ లో బీజేపీకి సొంత బలం అంటూ పెద్దగా లేదు. పార్టీ క్యాడర్ కూడా అనుకున్నంత స్థాయిలో లేదు. దీనితో బీజేపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఇప్పటికిప్పుడు క్యాడర్ ను ఏర్పరచుకోవటం అనేది కుదిరేపని కాదు, కాబట్టి వలస నేతలెవరైనా వస్తే వాళ్ళని ఇక్కడ పోటీకి దించాలని చూస్తున్నారు.
సాగర్ లో బీజేపీ తరుపున కడారి అంజయ్య యాదవ్ , నివేదితారెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు ఉన్నారు. వీరందరూ ఎవరి స్థాయిలో వాళ్లకు గాడ్ ఫాదర్లు ఉన్నారు. అయితే వీరందరూ కాదు..బయట నుంచి బలమైన నేతను తేవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో నివేదితా రెడ్డి అనే నేత పోటీ చేశారు. ఆమెకు మూడు వేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి కొంత క్రేజ్ వచ్చింది కాబట్టి తన బలంతో ఖచ్చితంగా గెలిచి తీరుతానని.. టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. సాగర్‌కు తమ పార్టీ తరపున ఇంచార్జ్‌గా సూర్యాపేట నేత సంకినేని వెంకటేశ్వరావును నియమించారు. ఆయన బీసీ నేతకు టిక్కెట్ ఇప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అంజయ్య యాదవ్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు.
చనిపోయిన నరసింహయ్య కూడా యాదవ సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీలో ఉంటున్నారు. టీఆర్ఎస్ తేరా చిన్నప్పరెడ్డికి టికెట్ ఇస్తోందన్న చర్చ నడుస్తోంది. అందుకే బీసీకే టిక్కెట్ ఇవ్వాలని కొంత మంది పట్టుబడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం కుల సమీకరణాలు కంటే కూడా బలమైన వలస నేత కోసం ఎదురుచూస్తుంది.
ఇందులో భాగంగా నల్గొండ జిల్లాకు చెందిన ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ నాయకత్వం. ఇటీవలే బీజేపీలో చేరుతానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గా చేస్తున్నాడు. అవసరం అయితే అతనితో రాజీనామా చేయించి మరి నాగార్జున సాగర్ లో పోటీకి దించాలని చూస్తున్నాడు బండి సంజయ్..