చాన్నాళ్ళ తర్వాత జనసేన నేత నాగబాబు పొలిటికల్ ట్వీటేశారు. అది కూడా ఏపీ మంత్రి పేర్ని నాని మీద. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ విషయంలో పేర్ని నాని ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం విదితమే. తన శాఖల బాధ్యతల్ని ఆయన ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారోగానీ, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడానికి ‘నాయుడు’ కోటాలో ఆయన చూపే అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. తాజాగా, ‘వకీల్ సాబ్’ మీద విమర్శలు చేయడం కోసం ప్రత్యేకంగా పేర్ని నాని బాధ్యతలు అందుకున్నట్టున్నారు. ఓ మంత్రిగారు, ఓ సినిమా గురించి ఇంతలా మాట్లాడాల్సిన అవసరమేంటి.? అని వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. తెరవెనుకాల పేర్ని నాని అసలు ఏమనుకుంటున్నారు.? ఎందుకు ‘వకీల్ సాబ్’ సినిమా మీద ఆయన ఇంతలా కక్ష పెంచుకున్నారు.? అన్న సంగతి పక్కన పెడితే, తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమాని పాచిపోయిన సినిమాగా అభివర్ణిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. దాంతో, నాగబాబు కూడా స్పందించాల్సి వచ్చింది. ‘మీకు ఏమి అయ్యింది నాని గారు.
మీరు కరోనా వ్యాక్సిన్‌తోపాటు రాబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి..’ అంటూ ట్వీటేశారు నాగబాబు. ‘ఇట్స్ అర్జంట్. ప్లీజ్, సెకెండ్ రాబిస్ వ్యాక్సిన్ టు మిస్టర్ నాని. స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునేవారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ’ అంటూ తన ట్వీటుని కొనసాగించారు నాగబాబు. అసలు రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి.? అన్న చర్చ ఇలాంటి సందర్భాల్లోనే గట్టిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అదుపు చేయలేని స్థాయికి పెరిగిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో కరోనా నిబంధనలు అమలు కావడంలేదు. ఆర్టీసీ బస్టాండ్లలోనూ అదే పరిస్థితి. తన శాఖ వ్యవహారాలు పట్టించుకోకుండా సినిమా గురించిన అత్యుత్సాహం ఎందుకు మంత్రి పేర్ని నాని ప్రదర్శిస్తున్నారు.? ఏమోగానీ, ఓ మంత్రిని ఉద్దేశించి రేబిస్ వ్యాక్సిన్ మీకు అవసరం.. అనడం నాగబాబుకి సైతం సబబు కాదు.