మనలో చాలా మందికి నిద్రలో కలలు వస్తాయి. వాటిలో కొన్ని మధురంగా ఉండగా, మరికొన్ని పీడకలలుగా మనసును కలవరపెడతాయి. కానీ మీకు ప్రతివారం ఒకటి కంటే ఎక్కువ సార్లు పీడకలలు వస్తుంటే జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా లండన్‌లో జరిగిన ఒక విశ్లేషణ ప్రకారం, తరచుగా పీడకలలు కలగడం కేవలం భయాందోళనకే పరిమితం కాదు.. అది అకాల మరణానికి సంకేతమని అంటున్నారు.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన డాక్టర్ అబిదేమి ఒటైకు చేసిన అధ్యయనంలో అమెరికా, బ్రిటన్‌లలోని 1.80 లక్షల మందిపై డేటా సేకరించారు. 2500 మంది పిల్లలను కూడా ఇందులో చేర్చారు. ఫలితాలు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. వారానికి తరచూ పీడకలలు కలిగేవారిలో 70 ఏళ్లలోపు మరణించే ప్రమాదం మూడింతల ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 174 మంది అకాల మరణానికి గురైన వారిలో 31 మందికి తరచుగా పీడకలలు వస్తున్నాయని గుర్తించారు.
నిపుణుల వివరణ ప్రకారం, పీడకలలు శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. దీని వలన శరీరంలో మంట (Inflammation) ఎక్కువ అవుతుంది. వయస్సు వేగంగా పెరుగుతుంది. క్రోమోజోమ్‌లలో వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. ఇవన్నీ కలిపి గుండె జబ్బులు, నాడీ సంబంధిత సమస్యలు, ఇమ్యూనిటీ సమస్యలకు దారితీస్తాయి. అలాగే పీడకలలు డిప్రెషన్, ఆందోళన, PTSD, స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మతలకు సంబంధం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీర్ఘకాలిక నొప్పి, లూపస్, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే ముందు లక్షణంగా కూడా పీడకలలు కనిపించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
2021లో సుమారు 11 శాతం మందికి తరచుగా పీడకలలు వచ్చేవి. కానీ 2019లో ఇది కేవలం 6.9 శాతం మాత్రమే. అంటే కాలక్రమేణా ఈ సమస్య పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి నెలా పీడకలలు వచ్చే వారి సంఖ్య 29 శాతం వరకు ఉంటే, వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు పీడకలలు కలిగేవారు 6 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదనే కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మానసిక చికిత్స (Psychotherapy) కొంతవరకు ఉపశమనం ఇస్తుంది. మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవడం, ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలు చేయడం అవసరం. జీవనశైలిని ఆరోగ్యకరంగా మార్చుకోవడం, నిద్ర పద్ధతులను క్రమబద్ధం చేసుకోవడం కూడా సహాయపడుతుంది.
పరిశోధకుల హెచ్చరిక స్పష్టంగా ఉంది “తరచుగా పీడకలలు వస్తున్నాయంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.” ఎందుకంటే ఇవి పెద్ద వ్యాధులకు మాత్రమే కాదు.. అకాల మరణానికి కూడా సంకేతం కావచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
