బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. పండుగ, పెళ్లి, శుభకార్యమంటే ముందుగా గుర్తొచ్చేది పసిడి. కానీ ఇప్పుడు ఆ పసిడి పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. కారణం ధరలు విపరీతంగా పెరగడం. ఒక్క వారంలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.10,000 ఎగబాకి, లక్షా పదివేల మార్క్‌ను తాకేసింది. బంగారం ధరలు ఇక్కడే ఆగిపోవని, ఇంకా ఎగబాకే అవకాశం ఉందని సంకేతం ఇస్తోంది.
నిపుణులు చెబుతున్నది ఏమిటంటే… బంగారం ధరల దిశను రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక గణాంకాలు నిర్ణయిస్తాయని చెబుతున్నారు. అమెరికా, చైనా, జర్మనీ, భారత్ వంటి పెద్ద దేశాల నుంచి వెలువడే ద్రవ్యోల్బణ డేటా, వినియోగదారుల భావజాలం, అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు అన్నీ బంగారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఒకవేళ చైనా తన వద్ద ఉన్న బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తే, ధరలు ఒక్కసారిగా 70–80 వేల మధ్యకు పడిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దీర్ఘకాలిక దిశ మాత్రం పెరుగుదల వైపే అని వారు హామీ ఇస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న గరిష్ట స్థాయిలో పెట్టుబడిదారులు కొంత లాభాల బుకింగ్ చేయడం వల్ల ధరల్లో తాత్కాలిక ఊగిసలాటలు ఉండొచ్చు. కానీ త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.1,10,000 నుంచి రూ.1,12,000 మధ్య చేరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరల ఈ పెరుగుదల వెనుక ముఖ్య కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి. డాలర్ బలహీనత, అమెరికా మార్కెట్లలో ప్రతికూలత, చైనాలో సెంట్రల్ బ్యాంక్ బంగారం నిల్వలను పెంచుకోవడం.. ఇవన్నీ పెట్టుబడిదారుల దృష్టిని పసిడి వైపు మళ్లిస్తున్నాయి. అంతేకాకుండా, స్టాక్ మార్కెట్ లో నష్టాలు పెరిగినప్పుడు ప్రజలు సేఫ్ హెవెన్‌గా బంగారాన్నే ఎంచుకోవడం సహజం.
మరోవైపు భారతదేశంలో పండుగల సీజన్ మొదలవ్వడం కూడా బంగారానికి అదనపు బలాన్నిస్తోంది. దసరా, దీపావళి, పెళ్లి సీజన్ ఇలా కలిపి డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయి. డిమాండ్ పెరిగిన చోట ధరలు స్థిరంగా ఉండడం అసాధ్యం. తాత్కాలికంగా చిన్న చిన్న పతనాలు వచ్చినా, దీర్ఘకాలికంగా బంగారం పెట్టుబడిదారుల కోసం భద్రమైన ఆశ్రయం అని నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల, పసిడి ప్రేమికులు తక్షణ ఆందోళన అవసరం లేకుండా వ్యూహాత్మకంగా కొనుగోళ్లు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
