Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రస్తుతం జనసేన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే కూటమి పొత్తులో భాగంగా ఈయన తన సీటును త్యాగం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయం గురించి నాగబాబు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కూటమి పొత్తు ధర్మం కోసం మొదటి త్యాగం చేసిన వ్యక్తిని తానేను అంటూ ఈయన తెలియజేశారు. కూటమి ఏర్పాటు అయిన తర్వాత తాను అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించాను కానీ పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు తాను తన సీటును త్యాగం చేశానని తెలిపారు.
అనకాపల్లిలో నిర్వహించిన జిల్లా జనసేన పార్టీ కార్యవర్గం సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పొత్తు ధర్మమే ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఉంటుందని పునరుద్ఘాటించారు. కూటమిలో పదవుల గురించి మాట్లాడుతూ కుట్రలకు పాల్పడుతున్న వారి చర్యలను తిప్పి కొట్టాలని ఈయన సూచించారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సాంకేతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి వైపు పరిగెడుతున్న ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. ఆ కోవలోనే తాము ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు నాగబాబు తెలియజేశారు. ఇక ఈయన అనకాపల్లి సీటును త్యాగం చేయడంతో జనసేన ఎమ్మెల్సీగా బాధ్యతలను ఇచ్చారు అయితే మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్న కానీ ఇప్పటివరకు నాగబాబుకు ఏ విధమైనటువంటి మంత్రి శాఖను కేటాయించలేదు. అయితే తనకు పదవులపై వ్యామోహం లేదని ప్రజా క్షేమమే పార్టీ కోసం పనిచేయడమే లక్ష్యంగా కొనసాగుతున్నానని నాగబాబు పలు సందర్భాలలో తెలియజేస్తూ వచ్చారు.
