రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక మార్పులు అవకాశం కనిపిస్తోంది. ఈ మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. 2024 ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే బలమైన కూటమి ఉండాల్సిందేనని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏలాగైతే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకున్నారో ఈసారి కూడ ఏ ఫార్ములాను రిపీట్ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా అయితే లేవు. అలాగని చంద్రబాబు తన ప్రయత్నాలను విరమించలేదు. ఏదో ఒక మూల నుండి రెండు పార్టీలను కడుపుతూనే ఉన్నారు.
బీజేపీ విషయానికి వస్తే జాతీయ స్థాయిలో తనకు పరిచయమున్న బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న ఆయన జనసేన విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్ వెంటపడ్డారు. జనసేనలో పవన్ తర్వాత నాదెండ్ల మనోహరే ముఖ్యమైన నేత. ఆయన సలహాలకు, సూచనలకు పవన్ వద్ద ఎప్పుడూ విలువ ఉంటుంది. పవన్ తన సొంత పనుల్లో బిజీగా ఉంటే పార్టీ వ్యవహారాలను చూసుకునేది మనోహరే. అందుకే ఆయన్ను పట్టుకుంటే జనసేనానిని ఒప్పించడం పెద్ద కష్టం కాదనేది టీడీపీ ఆలోచన. ఈమేరకు ప్రయత్నాలు కూడ మొదలయ్యాయి. మొన్నామధ్యన విజయవాడలో వంగవీటి రాధా నాదెండ్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశం వెనుక ప్రధాన ఎజెండా పొత్తు వ్యవహారమేనని అంటున్నారు.
అయితే టీడీపీతో పొత్తు అంటే పవన్ ఎంతలా వెనక్కు తగ్గుతున్నారో మనోహర్ అంతకంటే ఎక్కువగా వెనక్కు తగ్గుతున్నారట. కారణం టీడీపీతో జతకడితే తన రాజకీయ భవిష్యత్తుకు గండిపడుతుందనే భయమేనట. నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. కానీ ఆ తర్వాత అన్నీ వరుస ఓటములే. పైగా తెనాలి నుండి ఆయనకు టికెట్ ఇచ్చే ఏకైక పార్టీ జనసేన మాత్రమే. ఇప్పుడు టీడీపీతో గనుక పొత్తు పెట్టుకుంటే ఆ టికెట్ ఖచ్చితంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కొట్టుకుపోతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. జనసేన త్యాగం చేయాల్సిన స్థానాల్లో అది కూడ ఉంటుంది. ఆ పరిణామం నాదెండ్ల రాజకీయ ప్రయాణానికి స్పీడ్ బ్రేకర్ లాంటిది. అందుకే టీడీపీతో పొత్తు అంటే మనోహర్ ఎక్కువగా జంకుతున్నారట.