Prashanth Varma : ఒకటీ అరా వెబ్ సిరీస్‌లు చేశాడు. అలా అలా, నాని దృష్టిలో పడ్డాడు. ఆ డైరెక్టర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నేచురల్ స్టార్ నాని, తన సొంత బ్యానర్ ద్వారా ఆ కుర్రోడిని డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయం చేశాడు. మూస కథలతో కాకుండా ఏదో డిఫరెంట్‌గా జనాల్ని ఆకర్షించాలన్న అతని ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగ్గదే.
ఇంతకీ ఆ కుర్ర డైరెక్టర్ ఎవరో అర్ధమైపోయుంటుంది కదా. ప్రశాంత్ వర్మ. ‘అ.!’ అనే సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. సినిమా హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే, జాతీయ అవార్డు గెలుచుకున్నాడీ సినిమాతో ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత స్టార్ హీరో రాజశేఖర్‌తో ‘కల్కి’ సినిమా తెరకెక్కించి హిట్టు కొట్టాడు.
బాల నటుడు తేజ సజ్జాని హీరోగా పరిచయం చేస్తూ ‘జాంబిరెడ్డి’ అనే హారర్ కామెడీ సినిమా తీసి, మళ్లీ హిట్టు కొట్టాడు. ఇప్పుడు ఆ తేజ సజ్జాతోనే ‘హనుమాన్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. దీంతో పాటు, మనోడు ఈ మధ్య ఓ బిగ్ ఆఫర్ కూడా పట్టేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ, ‘అధీరా’ అను సినిమా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ.
అన్నట్లు ‘హనుమాన్’, ‘అధీరా’ సినిమాలు సూపర్ హీరో కాన్సెప్టుతో తెరకెక్కుతున్న చిత్రాలు కావడం విశేషం. డైరెక్టర్ల యందు తన డైరెక్షన్ వేరయా అనిపించుకోవాలనుకుంటున్నాడు ప్రశాంత్ వర్మ. అంతా బాగానే వుంది. కానీ, సూపర్ హీరో కాన్సెప్టుతో గతంలోనే చాలా చాలా సినిమాలొచ్చేశాయ్. అని లైట్ తీసుకుంటారేమో.
ప్రశాంత్ వర్మనా.? మజాకానా.? అస్సలు లైట్ తీసుకోవడానికి లేదంటున్నాడు. కాన్సెప్టు పాతదే అయినా, క్రియేటివిటీ కొత్తగా సరికొత్తగా వుండబోతోందని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడీ యంగ్‌స్టర్. అంతేనా, ఈ సూపర్ మ్యాన్ సినిమాలు రెండూ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలేనటండోయ్.
మరి, ఈ క్రియేటివ్ డైరెక్టర్ కొత్తగా చూపించబోయే ఆ సూపర్ మ్యాన్ ప్యాన్ ఇండియా స్టోరీలేంటో తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.