అదో బ్రహ్మ దేవాలయం. సాధారణంగా త్రిమూర్తులుగా పిలుచుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఊరికో గుడి చొప్పున అంతకన్నా ఎక్కువే అనేంతలా విష్ణువుకీ, శివునికీ దేవాలయాలుంటాయ్ కానీ, బ్రహ్మ దేవాలయాలు చాలా చాలా తక్కువగా కనిపిస్తుంటాయ్. మన దేశంలో మూడు చోట్ల మాత్రమే బ్రహ్మకు దేవాలయాలున్నట్లు సమాచారం.
అందులో ఒకటి రాజస్థాన్ పుష్కర్ దేవాలయం. ఈ దేవాలయంలోనికి పెళ్లయిన మగవాళ్లకు ప్రవేశం లేదట. బ్రహ్మ సతీమణి సరస్వతి శాపం కారణంగా ఈ ఆలయంలోకి పెళ్లయిన మగవాళ్లు ప్రవేశిస్తే, వారి వైవాహిక జీవితం అస్థవ్యస్థమవుతుందనీ, భార్య భర్తల మధ్య అనూహ్యమైన కలహాలు రేకెత్తుతాయనీ, జీవితం భ్రష్టుపట్టిపోతుందనీ అక్కడి ప్రజల విశ్వాసం.
ఆ భయంతోనే ఈ దేవాలయంలోకి పెళ్లయిన మగవాళ్లు ప్రవేశించే సాహసం చేయరు. కానీ, ఈ దేవాలయంలోని శిల్ప కళ చాలా గొప్పగా వుంటుంది. అలాగే, దేవాలయానికి వెళ్లే దారి చుట్టూ పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. ఆ వాతావరణాన్ని, అక్కడి శిల్ప సౌందర్యాన్నీ తిలికించి పులకించేందుకు ఈ ఆలయాన్ని ఒక్కసారైనా సందర్భించాలనుకుంటారు భక్తులు.
అయితే, గర్భ గుడిలోనికి మాత్రమే పెళ్లయిన మగాళ్లకు ప్రవేశం లేదు. కానీ, విశాలమైన గుడి ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఎలాంటి అభ్యంతరాల్లేవిక్కడ.