ఏపీలో సంచలనం సృష్టించిన మంత్రి నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకు సంబంధించి నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు టీడీపీ నేత కొల్ల రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పక్కా ఆధారాలతో కొల్లుని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ముందుగా రవీంద్రకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించామని..కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో గాలింపు కు దిగి అదుపులోకి తీసుకున్నామని వివరణ ఇచ్చారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరు పరిచినట్లు కొద్ది సేపటి క్రితమే ఎస్పీ మీడియాకు వెల్లడించారు. అలాగే నిందితుల నుంచి మోకా మర్డర్ కు సంబంధించి మరింత కీలక సమాచారం సేకరించారు.
మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మోకా భాస్కరావుకు- టీడీపీ నేతగా ఉన్న చింతా నాంచారయ్య అలియాస్ చిన్ని మధ్య ఎప్పటి నుంచో పాతకక్షలు, రాజకీయపరమైన గొడవలున్నాయని తేల్చారు. దీంతో భాస్కరరావుని చంపాలని చిన్ని 2013 నుంచి ప్రయత్నాలు చేసినా కుదరలేదని పోలీసులు తెలిపారు. తాజాగా మళ్లీ ఎలాగైనా భాస్కరరావు అంతమొందిం చాలని భావించడం..అందుకు కొల్లు రవీంద్ర సహకరించడం జరిగిందని చిన్ని విచారణలో భాగంగా తెలిపాడు. అంతా తాను చూసుకుంటానని కొల్లు హామీ ఇవ్వడంతోనే చిన్ని అండ్ గ్యాంగ్ ఎటాక్ కి దిగినట్లు పోలీసులు తెలిపారు.
గత నాలుగైదు నెలలుగా మర్డర్ ప్లాన్, చర్చలు వేగవంతం చేసినట్లు.. మర్డర్ జరగడానికి ముందు రోజు అంటే జూన్ 28న కూడా ప్లాన్ చేసినట్లు..కానీ ఆరోజు కుదరకపోవడంతో ఆ మరుసటి రోజు ఎటాక్ చేసినట్లు చిన్ని తెలిపాడు. అప్పటి నుంచి కొల్లు రవీంద్రతో ఆ గ్యాంగ్ టచ్ లో ఉన్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో కొల్లు రవీంద్ర కేసులో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. మిగతా నలుగురు నిందితుల నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.