కరోనా వైరస్ తీవ్రత ముంబైలో కాస్త నెమ్మదిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఇప్పటికీ మహారాష్ట్రలో 50 వేల పైచిలుకు కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నప్పటికీ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందన్నది వైద్య వర్గాల అంచనా. మరోపక్క, బెంగళూరు మాత్రం భయపెడుతోంది. అక్కడ జరుగుతున్న కరోనా టెస్టుల్లో 55 శాతం పాజిటివిటీ నమోదవుతుండడం గమనార్హం. అంటే, ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా సోకుతోందన్నమాట.. టెస్టులు చేయించుకున్నవారిలో. ఇది అత్యంత భయానకమైన పరిస్థితిగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న 40 వేల టెస్టులు చేస్తే, 22 వేల కరోనా పాజిటివ్ కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా వుంటే, తమిళనాడు రాజధాని చెన్నయ్ కూడా పాజిటివిటీ రేటు విషయంలో అనూహ్యంగా దూసుకెళుతోంది.
ఆంధ్రపదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా వుందని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. ఎందుకిలా.? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. మరోపక్క, దేశంలో పలు రాష్టరాలు ఇప్పటికే ‘లాక్ డౌన్’ ప్రకటిస్తున్నాయి తమ తమ రాష్ట్రాల్లో. ఆంధ్రపదేశ్ అయితే, 18 గంటల కర్ఫ్యూ అవలంభిస్తోంది. ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల్ని పాక్షికంగా మూసివేసింది. ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి అదుపులోనే వుంది. ఈ సమయంలోనే ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుంది. కాగా, హైదరాబాద్ నగరంతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికీ వైద్య చికిత్స అందుతోందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.