‘మీ కంటే మా కుటుంబానికి ఎక్కువ చరిత్ర వుంది..’ అంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుపైకి ఓ లేఖాస్త్రాన్ని సంధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. అంతేనా, ‘మీ దగ్గర, మీ మామగారైన ఎన్టీయార్ దగ్గర నేను పని చేశాను. కానీ, మీలా నేను వెన్నుపోటు పొడవలేదు..’ అని కూడా ముద్రగడ పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో ముద్రగడపై కాపు ఉద్యమం నేపథ్యంలో నడిచిన నిర్బంధం అందరికీ తెలిసింది. ఆనాటి ఆ భయంకరమైన పరిస్థితుల్ని ముద్రగడ తాజాగా గుర్తు చేసుకుంటూ చంద్రబాబుకి రాసిన లేఖలో వాటిని ప్రస్తావించారు. తన కుటుంబంలోని మహిళల్ని పోలీసులు దూషించిన తీరు, నారా లోకేష్ తనను దూషించిన తీరుని కూడా పేర్కొన్నారు ముద్రగడ.
‘అప్పుడు మీరు చేసిన, చేయించిన అవమానానికి మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళింది..’ అంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అంతలా అవమానించిన మీరు, ఇప్పుడు మీ భార్యని ఎవరో అవమానించారంటూ మీడియా ముందు కంటతడి పెట్టడం శోచనీయంగా వుంది..’ అని ముద్రగడ ఎద్దేవా చేయడం గమనార్హం.
‘భూమి గుండ్రంగా వుంటుంది..’ అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, చంద్రబాబు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడనే అర్థంలో ముద్రగడ చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమబాట పట్టారు. ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ముద్రగడ కుటుంబాన్ని నిర్భందించడం, ఈ క్రమంలో ఆయనపై భౌతిక దాడి కూడా జరగడం తెలిసిన సంగతులే.