కాపులను చంద్రబాబు అలా కూల్ చేయబోతున్నారా..?

ప్రస్తుతం ఏపీలో కాపులు అటు చంద్రబాబుపైనా, ప్రధానంగా ఇటు పవన్ కల్యాణ్ పైనా కారాలూ, మిరియాలూ నూరేస్తున్నారనే చర్చ బలంగా నడుస్తుందని అంటున్నారు. జగన్ ని గద్దె దింపితే కాపు నేస్తం పోయినా.. వాహనమిత్ర రాకున్నా.. మిగిలిన సూపర్ సిక్స్ హామీలు వస్తాయి కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది.. పైగా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రభుత్వంలో కీరోల్ లో ఉంటారని ఆశించారని అంటారు.

అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అయ్యారు కానీ… ఆయనపై ఆ సామాజికవర్గ ప్రజానికం, కాబోయే సీఎం పదవికి ఇది పునాది అని ఆశించిన స్థాయిలో పని చేయడం లేదని.. తన జీవితం అంతా బాబు ఫ్యాన్ గానే ఉండాలని భావిస్తున్నట్లున్నారని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఎన్ని ఘోరాలు జరిగినా వాటిపై ఆయన స్పందించే తీరు జుగుప్సాకరంగా ఉందనే కామెంట్లూ వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఎవరైతే తమను (బ్లైండ్ గా!) నమ్మి అందరు ఎక్కించారో వారే తిరిగి దించేసే ప్రమాదం తలెత్తేలే ఉందని భావించారో ఏమో కానీ… కాపులను ఏదో రకంగా కూల్ చేసి, తమకు శాస్వత ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కాపులకు రిజర్వేషన్స్ ఇచ్చే విషయంలో ఆయన అధికారులతో చర్చిస్తున్నారని.. సాధ్యాసాధ్యాలపై నివేదికలు తెప్పించుకుంటున్నారని అంటున్నారు.

వాస్తవానికి గత మూడు దశాబ్దాలుగా కాపులకు తీరని కోరికగా ఉంది ‘కాపులకు రిజర్వేషన్లు’ అనే అంశం. ఇందులో భాగంగా వారిని బీసీలలో చేర్చాలని డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ మీద కాపు నేత ముద్రగడ పద్మనాభం 1994 నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ మేరకు 2014లో చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినా అది నెరవేరలేదు!

అయితే ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మరో మారు అధికారంలోకి వచ్చింది. కాపులకు వారి రిజర్వేషన్ల కోరిక తీర్చాలని, ఆ విధంగా అయినా వారిని శాంతింపచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు అంటే అది మళ్లీ ఇబ్బందుల్లో పడుతుంది. పైగా బీసీలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే క్రమంలో… రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా ఉండాలని సుప్రీం కోర్టు తీర్పు ఉంది.

దీంతో… చంద్రబాబు మరో మార్గంలో వెళ్తారని అంటున్నారు. ఇందులో భాగంగా… కేంద్రం తీసుకొచ్చిన ఈబీసీ కోటా ను ఉపయోగించాలని భావిస్తుందని అంటున్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్లు పది శాతం కేటాయించగా.. అందులో నుంచి అయిదు శాతం రిజర్వేషన్లు కాపులకు ఇవ్వాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు కాపులకు రిజర్వేషన్స్ అని చెప్పి ఓ జీవో ఇచ్చారు. అయితే… దానికి చట్టబద్ధమైన ఇబ్బందులు ఉన్నాయని అది చెల్లలేదు! అప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఉంది. కానీ… వ్యూహాత్మకంగా అలా చేశారో.. కాపులను ఏమార్చడానికి అలా చేశారో తెలియదు కానీ… నాడు అలా జరిగిపోయింది.

ఈ సమయంలో చంద్రబాబు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని అంటున్న వేళ… ఈసారి అయినా ఏమార్చే విధంగా కాకుండా, సిన్సియర్ గా చెయాలని, కేంద్రంలో మోడీ సహాయ సహకారాలు పూర్తిగా సద్వినియోగం చేయాలని ఆ సామాజికవర్గ ప్రజానికం కోరుతున్నారు. అయితే.. కాపులను బీసీల్లో చేర్చడం అంటే… అది ఈబీసీనా అనేది మరో ప్రశ్న!