వైసీపీలో రచ్చ: ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ.. అదుపు చేసేదెవరు.?

బస్తీ మే సవాల్.. అంటూ ఓ వైసీపీ ఎంపీ, ఓ వైసీపీ ఎమ్మెల్యే.. రచ్చకెక్కారు. ఒకరి మీద ఇంకొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. నేను చిటికె వేస్తే.. వెయ్యిమంది వస్తారు.. ఇంకోసారి చిటికె వేస్తే లక్ష మంది వస్తారంటూ ఓ ఎమ్మెల్యే, తమ పార్టీకే చెందిన ఎంపీని హెచ్చరిస్తే, ‘వచ్చేదెవరు.? బ్లేడ్ బ్యాచ్.? గంజాయి బ్యాచ్.?’ అంటూ ఎంపీ రివర్స్ ఎటాక్ చేసేశారు. ఆ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాగా, ఆ ఎంపీ మార్గాని భరత్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీకీ, అదే జిల్లాలోని ఎంపీగారి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేకీ మధ్య రచ్చ ఇది. ఈ ఇద్దరికీ ఎక్కడ చెడిందోగానీ, ఇద్దరూ కలిసి పార్టీ పరువుని బజార్న పడేస్తున్నారు. ఇద్దరూ ఇలా మీడియాకెక్కడం వెనుక అధికార పార్టీ పెద్దలున్నారా.? అన్న విషయమై వైసీపీ వర్గాల్లో కొంత గందరగోళం కనిపిస్తోంది.

అధిష్టానం కన్నెర్ర జేస్తుందని తెలిసీ ఎంపీ, ఎమ్మెల్యే ఇలా మీడియా ముందుకొచ్చి దూషణలకు దిగడమేంటి.? ఎంపీ భరత్ రామ్, అచ్చం రఘురామకృష్ణరాజులాగానే పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారన్నది జక్కంపూడి రాజా ఆరోపణ. ‘నాన్సెన్స్.. నేనలాంటోడ్ని కాదు..’ అని భరత్ అంటున్నారు. ఎవరు చెబుతున్నది నిజం.? 25 కోట్ల మేర అక్రమాలకు ఎంపీ తెరలేపారని ఎమ్మెల్యే ఆరోపిస్తోంటే, ఎమ్మెల్యేపైనా అదే స్థాయిలో ఎంపీ రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. ఇద్దరూ చెప్పింది నిజమే అయితే, అది జిల్లాలో పార్టీకి తీరని నష్టం కలిగించే అంశం. ఇంత జరుగుతున్నా డ్యామేజీ కంట్రోల్ చర్యలకు వైసీపీ అధిష్టానం సిద్ధపడటంలేదు. ఆవ భూముల విషయంలో ఇరువురి మధ్యా రచ్చ షురూ అయ్యిందనే వాదన వినిపిస్తోంది జిల్లాలో. ఎక్కడో పంపకాల్లో తేడాలు వచ్చి వుంటాయని విపక్షాలు మండిపడుతున్నాయి. జక్కంపూడి కుటుంబానికి జిల్లాలో మంచి పేరుంది. దాన్ని డ్యామేజ్ చేయడానికి ఎంపీ భరత్ నడుం బిగించారన్న వాదన మరింత ఎక్కువగా వినిపిస్తోంది.