ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం FRBM పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి రాసిన లేఖలో సురేష్ ప్రభు చెప్పారు.
రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీనితో ఆర్థిక పురోగతి కుంటుపడటమే కాకుండా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్ ప్రభు రాసిన లేఖలో పొందుపరిచారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితి ఆందోళనకరంగా మారిందని తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితి పై చేయిదాటక ముందే తగిన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ ను సురేష్ ప్రభు తన లేఖలో కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు ఎంపీ సురేష్ ప్రభు ఈ మేరకు లేఖలు రాశారు.
గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన సురేష్ ప్రభు ,ఏపీ ప్రభుత్వం పై ఈ విధంగా లేఖ రాయడంతో దీనిపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుదో చూడాలి. సురేష్ ప్రభు ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో ఎన్డీయేకు మద్దతు సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు.