వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈసారి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మీద, వైసీపీ నేతల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారాయన. ఈసారి ఏకంగా తనపై అటాక్ చేయడానికి కుట్ర జరగబోతోందని పెద్ద షాక్ ఇచ్చారు. తనపై దళితులతో దాడి చేసే కాన్సెప్ట్ రూపొందించారని చెబుతూ ‘కొంతమంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇంచార్జులుగా ఉన్నవారు పాలకొల్లు నుండి కొందరి, ఉంది నుండి కొందరు వచ్చి నా కార్యాలయంపై దాడులు చేయబోతున్నారు. కావాలంటే మీరే చూడండి. దీని ముఖ్య ఉద్దేశ్యం దాడుల తర్వాత నేను ఆవేశపడి ఏమన్నా అంటే నా మీద దళిత వ్యతిరేకి అనే ముద్ర వేయడానికే’ ఈ ప్లాన్ అని చెప్పుకొచ్చారు.
ఒక ఎమ్మెల్యే నన్ను ఊళ్లోకి వస్తే పిచ్చ్చి కుక్కని కొట్టినట్టు కొట్టేస్తారని అన్నారు. కానే నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడిన దానికి సాక్ష్యాలున్నాయి. సాక్షి పేపర్లో, ఛానెల్లో నేను దళిత వ్యతిరేకినని వార్తలొస్తాయి. నా నియోజకవర్గంలోనే కొందరు దళిత నాయకులను నాపై దాడికి రమ్మని అడిగారు. కానీ వాళ్ళు రామన్నారు. నాకు కరోనా అంటించే కుట్ర కూడ చేస్తున్నారు. క్రిస్టియన్ దళితులతో నాపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారు. హిందువులు మేల్కొనాలి, మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి’ అంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చారు.
ఈ మాటలతో ఇన్నాళ్లు వైసీపీ వెర్సెస్ రఘురామకృష్ణరాజు అన్నట్టు ఉన్న వ్యవహారంలోకి మతాలు కూడ ప్రవేశించినట్టయింది. సీఎం ఆఫీసు నుండి, పార్టీ ఆఫీసు నుండి వచ్చిన ఆదేశాల మేరకే ఈ దాడి జరుగుతోంది. నాపై దాడి చేస్తున్నది హిందూ దళితులు కాదు క్రిస్టియన్ దళితులు. సీఎం క్రిస్టియనే కాబట్టి నాపై దాడి జరగనుంది. నాపై కేసులు పెట్టినవారంతా క్రిస్టియన్లే అంటూ ప్రజలారా మేలుకోండి, ఒకసారి మోసపోయాం, ఇంకోసారి మోసపోవద్దు, హిందువులారా నాపై దాడిని ఖండించండి అంటూ ఆవేదనతో మాట్లాడేశారు. మరి రఘురామరాజు ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఏ విధంగా ఇస్తారో చూడాలి.