ఎంపీ రఘురామకు బెయిల్: కండిషన్స్ అప్లయ్..

MP Raghurama Gets Bai, But..

MP Raghurama Gets Bai, But..

ఎట్టకేలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ, పలు షరతుల్ని కూడా విధించింది. అందులో ముఖ్యమైన షరతు.. మీడియాతో మాట్లడకూడదు.. సోషల్ మీడియా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకూడదు. ఇక, విచారణకు సహకరించాలి, విచారణపై ప్రభావం చూపేలా వ్యవహరించకుడదు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. టీడీపీ సహా ఇతర పార్టీల తెరవెనుక మద్దతుతో చెలరేగిపోయారు. మీడియాకెక్కి నానా రచ్చా చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలోనూ రఘురామ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించారనీ.. మతాల మధ్య చిచ్చు రేపేందుకు ప్రయత్నించారనీ అభియోగాలు ఆయన మీద మోపబడ్డాయి.

రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద ఆయన్ని ఇటీవల ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం విదితమే. అయితే, తనను అరెస్టు చేసి చిత్ర హింసలకు గురిచేశారంటూ రఘురామ, న్యాయస్థానం ముందు వాపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆయన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించగా ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పూర్తి నివేదిక, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంతకు ముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యలు ఇచ్చిన నివేదికతో ఆర్మీ ఆసుపత్రి ఇచ్చిన నివేదికకు పొంతనే లేదు. ఈ వ్యవహారంపైనా సుప్రీంకోర్టులో ఇరుపక్షాల మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. చివరికి న్యాయస్థానం, రఘురామకు తగిలిన గాయాలు నిజమేనని అభిప్రాయపడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నాక తగలిగిన గాయాలుగానే వాటిని పరిగణిస్తున్నట్లు పేర్కొంది. షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే, జగన్ సర్కారు మీద విమర్శలు చేయకుండా క్షణం కూడా వుండలేని రఘురామ నోటికి ‘షరతు’ పేరుతో తాళం వేసింది న్యాయస్థానం.