వైకాపా ఎంపీ రఘురామకృష్ణమరాజు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు గాను షోకాజ్ నోటీస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రఘురాం తనదైన శైలిలో స్పందించి…ప్రత్యర్ధులకు సౌండ్ లేకుండా చేసారు. అటుపై ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. దీంతో వైకాపా వర్సెస్ రఘురాం అన్నంత గా సీన్ వేడెక్కింది. అయితే తాజాగా రఘురాం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖ రాసారు. ఆ లేఖ సారాంశం జగన్ ని బుజ్జగిస్తున్నట్లే ఉంది. రిజీస్టరైన పార్టీ కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్ తో నోటీస్ వచ్చిందన్నారు. వైకాపా అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో ఈసీ పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. అయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మాత్రం తాను ఎప్పుడు విధేయుడినని చెప్పారు. టీటీడీ ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను మాత్రమే వివరించానన్నారు. అప్పుడే హిందువుల మనోభావాల గురించి చెప్పే ప్రయత్నం చేసానని లేఖలో తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా ఏ సందర్భంలోనూ మాట్లాడలేదని, ఇసుక విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కలిసే ప్రయత్నం చేసా. కానీ అవకాశం దొరకలేదన్నారు. దీంతో మరో మార్గం లేక మీడియా ద్వారా ముందుకొచ్చానని, అదీ రాజ్యాంగానికి లోబడే మాట్లాడానని, జగన్ పైగానీ, పార్టీపై గానీ వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.
జగన్ చుట్టూ ఉన్న కొందరు తనని క్రైస్తవ మత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేసారని, మీమ్మల్ని కలవనీయకుండా చేస్తున్న వ్యక్తి కూడా వారేనని రఘురాం లేఖలో పేర్కొన్నారు. దీంతో రఘురాం స్వరం మారినట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా పార్టీపై సీరియస్ గా ఉన్న రఘురాం ఇప్పుడు దూకుడు తగ్గించి పార్టీకి విధేయుడిగా ఉన్నట్లే స్వరం వినిపించారు. మరి ఈ లేఖపై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.