ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. మామూలుగా కాదు.. ఏ పార్టీని కదిలించినా తమ ఉగ్రరూపం చూపించేలా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇంతలా రాజకీయాలు వేడెక్కలేదు కానీ.. ఒక్క నియోజకవర్గం ఉపఎన్నిక కోసం పార్టీలన్నీ ఇంతలా కొట్లాడుతున్నాయంటే తెలంగాణ రాజకీయాలు మామూలు కాదు అని అర్థం అవుతోంది ప్రజలకు.
ఒక్క సీటు.. ఈ సీటు గెలవడం వల్ల ఏపార్టీకి ఒరిగే లాభం లేదు. ప్రభుత్వాలు కూడా కూలిపోవు. కానీ.. అన్ని పార్టీలు దుబ్బాక సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
మరోవైపు సిద్ధిపేటలో జరిగిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు ప్రవర్తించిన తీరును రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు.
కరీంనగర్ లో అయితే జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. బండి సంజయ్.. నిరాహార దీక్ష చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా.. బండి సంజయ్ దీక్షకు మద్దతు పలికారు.
ఈసందర్భంగా మాట్లాడిన అర్వింద్.. సీపీ జోయల్ డేవిస్ టార్గెట్ చేస్తూ మాట్లాడారు. జోయల్ ఏమనుకుంటున్నారు అసలు.. ఆయన పోలీసా? లేక గుండానా? జోయల్ డేవిస్ ను వెంటనే సస్పెండ్ చేయాల్సిందే. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అంటూ అర్వింద్ ప్రశ్నించారు.
జోయల్.. గుర్తుపెట్టుకో.. నా పేరు అర్వింద్. నేను నీ పేరును గుర్తు పెట్టుకుంటాను.. అంటూ ఆయన్ను టార్గెట్ చేస్తూ అర్వింద్ వ్యాఖ్యలు చేశారు.