విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే మరో పేలుడు సంభవించింది. పరవాడ పార్మాసిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో అర్ధరాత్రి భారీ ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో బెంజిన్ మెడిజోన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో షిప్ట్ ఇన్ చార్జ్ నరేంద్ర(33), కెమిస్ట్ గౌరీశంకర్ (26) మృతి చెందారు. ఇంకా కొంత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటన అనంతరం బాధితుల్ని గాజువాక ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమీషనర్ పరిశీలించారు.
ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసు నమోదు చేసారు. ఈ ఘటనతో కంపెనీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. అయితే పోలీసులు కంపెనీకి సంబంధించి ఓ కీలక విషయాన్ని తెలిపారు. మూడేళ్ల క్రితం ఇదే కంపెనీలో ఇలాంటి పేలుడే సంభవించింది. రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారని పోలీసులు తెలిపారు. దానిపై ఇప్పటికీ విచారణ జరుగుతుందని గుర్తు చేసారు. తాజా ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
విశాఖలో వరుసగా ఈ విస్ఫోటనాలు ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్ జీ పాలిమర్స్ ఘటన పూర్తిగా మరువకే ముందే, అదీ నెల రోజులు కూడా గడువక ముందే ప్రమాదం చోటు చేసుకోవడం రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సాయినార్ ఫార్మా కంపెనీలోనే మరోసారి ఘటన చోటు చేసుకోవడంతో ఆ కపెనీలో భద్రత డొల్ల లా కనిపిస్తోంది. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకుని బ్యాన్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కార్పోరేట్ కంపెనీలకు పేదవాళ్ల ప్రాణాలు పణంగా పెట్టాలా? అని ప్రశ్నిస్తున్నారు. కంపెనీలో పనిచేసే ప్రతీ ఒక్కరికి భద్రత కల్పించాలని, ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసే వారికి ఎప్పుడైనా! ఫైర్ అయినా సురక్షితంగా ప్రాణాల నుంచి కాపాడే కిట్లు లాంటివి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వాలు కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు.