Llish fish or ilisha fish or hilsa fish or ilish fish.. పులస చేప లేదా పద్మ చేప.. పేరు ఏదైనా సరే.. పులస చేపకు ఉన్న డిమాండే వేరు. మన దగ్గర అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వర్షాకాలం సమయంలోనే పులస చేప దొరుకుతుంది. తులం బంగారం అమ్ముకొని అయినా పులసను తినాలన్నారు పెద్దలు. పులస చేపకు ఉన్న డిమాండ్ అటువంటిది. మార్కెట్ లో దాని రేటు కిలోకు వేలల్లో ఉంటుంది. ఎంత రేటు ఉన్నా పులస చేపను కొనుక్కోవాల్సిందే.. రుచి చూడాల్సిందే.
అయితే.. పశ్చిమ బెంగాల్ లో పులస చేపకు, దేవీ నవరాత్రి ఉత్సవాలకు సంబంధం ఉంది. సరిగ్గా.. దేవీ నవరాత్రుల సమయంలోనే పులస చేపలు.. బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అవుతాయి. ప్రతి సంవత్సరం పులస చేపలను ఒకేసారి మార్కెట్ లోకి దిగుమతి చేసుకుంటారు. అది కూడా దేవీ నవరాత్రుల సమయంలోనే.
నిజానికి.. బెంగాలీలకు చేపలు అంటే ప్రాణం. ప్రతి రోజు వాళ్లింట్లో చేపల కూర ఉండాల్సిందే. వారానికి సరిపడా ఒకేసారి చేపలను కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజూ వేయించుకొని మరీ లాగించేస్తారు బెంగాలీలు.
అయితే.. దేవీ నవరాత్రుల సమయంలోనే పులస చేపలు దిగుమతి అవుతుండటంతో వాటిని ప్రతి కుటుంబం ఆ సమయంలో కొనుగోలు చేస్తుంది. కిలో 5 వేలకు పైనే ఉన్నా సరే.. ఖచ్చితంగా పులసను కొనుక్కుంటారు బెంగాలీలు.
అమ్మవారి అనుగ్రహంతోనే ఈ చేపలు… దేవీ నవరాత్రుల సమయంలో బెంగాల్ కు దిగుమతి అవుతాయని అక్కడి వారి నమ్మకం. అందుకే… ఖచ్చితంగా వాటిని కొనుక్కొని ఫ్రిడ్జ్ లో దేవీ నవరాత్రులు అయిపోయేంతవరకు దాచుకొని.. తర్వాత కూరొండుకొని తినేస్తారట. అదే వాళ్ల ఆచారం.