Fire Accident: కరోనా వార్డులో అగ్నిప్రమాదం.. సజీవ దహనమైన మహిళ..!

Fire Accident: ప్రస్తుతం అన్ని దేశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా రెండో దశలో కేసుల సంఖ్య ఎక్కువై హాస్పిటల్లు కిటకిటలాడాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మొదలైంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో హాస్పిటల్లు రోగులతో నిండిపోతున్నాయి. కరోనా మొదటి ,రెండవ దశ లో అగ్నిప్రమాదం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అచ్చం అలాంటి సంఘటన మూడవ దశలో కూడా చోటు చేసుకుంది.

ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని ప్రఖ్యాత బుర్ద్వాన్ మెడికల్ హాస్పిటల్లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. కరోనా వార్డు లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో ఉద్యోగులందరూ భయపడిపోయారు. అతి తక్కువ సమయంలోనే భారీ ఎత్తున మంటలు వార్డు మొత్తం విస్తరించాయి. భయంతో రోగులు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటికి పరుగులు తీశారు. కానీ 60 సంవత్సరాల వయసున్న సంధ్యా రాయ్ అను ఒక మహిళ దాదాపు కదల్లేని పరిస్థితిలో ఉండి మంటల్లో చిక్కుకొని మరణించారు. ఈవిడ తూర్పు బుర్ద్వాన్ జిల్లాకు చెందినది గా సిబ్బంది గుర్తించారు.

మంటలను గుర్తించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంట సమయం పాటు కష్టపడి ఆస్పత్రిలో మంటలను అదుపులో ఉంచారు. ఇదిలా ఉండగా ఆస్పత్రిలో జరిగిన సంఘటనకు బాధ్యత వహించడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరించారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందో తెలుసుకోవటానికి ఐదుగురు సభ్యులను దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేశామని,ఫోరెన్సిక్ విచారణ జరిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రిన్సిపల్ ప్రబీర్ సేన్‌గుప్తా మీడియాకు తెలియజేశారు.