కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం అయింది. ఉద్యోగాలు లేవు.. చేతలో చిల్లిగవ్వ లేదు. పని లేదు.. దీంతో ఈఎంఐలు కట్టాల్సిన వాళ్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అందుకే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి.. గత నెల 31 వరకు ఈఎంఐలపై మారటోరియం విధించాయి. అలాగే మారటోరియం సమయంలో వడ్డీ మాఫీ కూడా చేయాలంటూ ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో వడ్డీ మాఫీ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
దానితో పాటుగా మారటోరియం గడువు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను కూడా సుప్రీం విచారించింది..
దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం… పెండింగ్ లో ఉన్న ఈఎంఐలపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయకూడదని ఆదేశించింది.
అయితే.. బ్యాంకులు మారటోరియం సమయంలో వడ్డీని పరిగణిస్తాయన్న కేంద్రం… మారటోరియాన్ని మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ విచారణను ఆలస్యం చేయకూడదని.. దీనిపై పూర్తి విచారణను బుధవారం నిర్వహించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
పేరుకు మారటోరియం అవకాశం ఇచ్చి.. దానిపై వడ్డీని వసూలు చేయడం కరెక్ట్ కాదంటూ.. సుప్రీంలో పిటిషన్ వేశారు. మారటోరియం వల్ల ఈఎంఐల కాలపరిమితి పెరగడంతో పాటుగా… వడ్డీ కూడా చెల్లించాల్సిందేనని ఆర్బీఐ కూడా ఇదివరకే స్పష్టం చేసినా… దీనిపై పూర్తి స్థాయి విచారణ రేపు జరగనుంది.
ఒకవేళ అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. మరో రెండేళ్ల వరకు మారటోరియాన్ని పొడిగించే అవకాశం ఉండటంతో పాటుగా… చెల్లించని ఈఎంఐలపై వడ్డీ కూడా మాఫీ అయ్యే అవకాశం ఉంది.