సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే.. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు ఆయన లేఖ రాశారు. కాగా, సీజేఐగా జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో తన తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫారసు చేయాల్సిందిగా గత శుక్రవారమే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు బోబ్డేకు లేఖ రాసినట్టుగా విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇక, 1957, ఆగస్ట్ 27న జన్మించిన జస్టీస్ ఎన్వీ రమణ పదవీ కాలం 2022, ఆగస్ట్ 26తో ముగియనుంది. తొలుత జస్టిస్ ఎన్వీ రమణ.. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేరారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌కే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పదవి దక్కాల్సి ఉంటుంది.
ఇక, జస్టిస్ ఎస్ఏ బోబ్డే 47వ సీజేఐగా 2019 నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ తెలుగువారు.. 1957 ఆగస్ట్ 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు. 2017 ఫిబ్రవరి 14 నుంచి జస్టిస్ రమణ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. అంతకుముందు ఆరు నెలల పాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. 2000 జూన్ 27 నుంచి 2013 సెప్టెంబర్ 1 వరకు ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పని చేశారు.