ఎట్టకేలకు సినీ నటుడు అలీకి వైసీపీ ప్రభుత్వంలో ఓ పదవి దక్కింది. తర్వాత ఏంటి.? వెయిటింగ్ లిస్టులో వున్న పోసాని కృష్ణమురళి, మంచు మోహన్‌బాబు తదితరులకు రానున్న రోజుల్లో ఎలాంటి పదవులు దక్కనున్నాయి.? ఈ విషయమై ఏపీ రాజకీయ వర్గాల్లోనూ, ఇంకో వైపు సినీ పరిశ్రమలోనూ ఆసక్తికరమైన చర్చ జరగబోతోంది.
సినీ పరిశ్రమ నుంచి రోజా మంత్రిగా వున్నారు. నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా పని చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి దక్కింది. అన్నట్టు, సినీ నటుడు పధ్వీకి ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా అవకాశం దక్కినా.. ఆయన ఆ పోస్టులో ఎక్కువ కాలం వుండలేకపోయారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో కూడా లేరు.
ఇదిలా వుంటే, త్వరలో మోహన్‌బాబుకీ అలాగే పోసాని కృష్ణమురళికి కూడా పోస్టులు దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అలీ తరహాలోనే సలహాదారు పోస్టులతో సరిపెడతారా.? లేదంటే, ఇంకేవైనా పోస్టులు క్రియేట్ చేస్తారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.
పోసాని కృష్ణమురళి మరీ పెద్ద పదవి ఏమీ ఆశించరు. కానీ, మోహన్ బాబు వ్యవహారం వేరు. గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.. అదీ టీడీపీ హయాంలో. సో, చిన్న పదవి ఇస్తే.. మోహన్‌బాబు తీసుకునే అవకాశం వుండకపోవచ్చు. టీటీడీ ఛైర్మన్‌గిరీని మోహన్‌బాబు ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘నేనేమీ పదవుల్ని ఆశించను..’ అని పలు సందర్భాల్లో మోహన్‌బాబు చెప్పినా, పదవుల గురించి ఆశపడనివారు ఎవరుంటారు.? రాజ్యసభ సీటు కోసమే మోహన్‌బాబు ఇంకా ప్రయత్నిస్తూనే వున్నారన్నది సినీ వర్గాల్లో జరుగుతోన్న ప్రచారం తాలూకు సారాంశం. సో, ‘సలహాదారు’గా అవకాశమిచ్చినా, మోహన్‌బాబు దాన్ని తిరస్కరించే అవకాశాలే ఎక్కువ.