Mohammed Shami: గత కొన్నేళ్లుగా టెస్టుల్లో భారత జట్టు సాధిస్తున్న విజయాలకు కారణమైన ఫాస్ట్-బౌలింగ్ యూనిట్‌లో కీలకమైన బౌలర్ గా ఉన్న ‘మహ్మద్ షమీ’ తాజాగా ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఆతిధ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో మొత్తం ఐదు వికెట్స్ తీసి టెస్టుల్లో 200 వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా ఈ ఘనత సాధించాడు. ఐతే వేగంగా ఈ మైలురాయిని అందుకున్న వారి జాబితా చూసుకుంటే షమీ కన్నా ముందు కపిల్ దేవ్, జవగల్ శ్రీనాథ్ లు ఉన్నారు.
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న షమీ మాట్లాడుతూ… తన విజయాలకు సంబందించిన క్రెడిట్ మొత్తాన్ని తండ్రి మరియు సోదరుడికి ఇచ్చాడు. “నేను ఈనాటికీ సౌకర్యాలు లేని గ్రామం నుండి వచ్చాను, క్రికెట్ ప్రాక్టీస్ కోసం అక్కడ నుండి 30 కిలోమీటర్లు ప్రయాణించటానికి నాన్న ప్రోత్సహించేవాడు, అంతేకాకుండా కొన్నిసార్లు నాతో పాటు వచ్చేవాడు. ఆ పోరాటం ఎప్పుడూ నాతోనే ఉంది, నా ప్రయాణంలో మద్దతు ఇచ్చిన మా నాన్న మరియు సోదరుడికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను” అని పేర్కొన్నారు.
జస్ప్రీత్ బుమ్రా తన మొదటి స్పెల్ మధ్యలో చీలమండ గాయంతో మైదానం నుండి బయటికి వెళ్లడంతో, భారత బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించిన షమీ ప్రత్యేక ప్రదర్శనతో సఫారీ జట్టును 197 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో భారత్ 130 పరుగుల తోలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచి మ్యాచ్ పై పాటు సాధించింది. ఇక మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుట్ అవటంతో నైట్ వాచ్మెన్ గా బాటింగ్ కు దిగిన శార్దూల్ ఠాకూర్ తో కలిసి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నాడు. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోర్ 16/1గా ఉంది.