కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, అయినా తప్పని తిప్పలు

కొత్త వ్యసాయ చట్టాల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆ సాగు చట్టాలకు సంబంధించిన రద్దు బిల్లుల్ని ఉభయ సభల్లోనూ మోడీ ప్రభుత్వం పెట్టింది. రెండు సభల్లోనూ ఈ బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా పాస్ అయ్యాయి. రైతు సమస్యలపై చర్చ కోసమంటూ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు పట్టుబట్టినా, ప్రభుత్వం చర్చకు ఆస్కారమివ్వకుండానే పని కానిచ్చేసింది.

రైతుల్ని ఉద్ధరించడం కోసమంటూ కొత్త వ్యవసాయ చట్టాల్ని తీసుకువచ్చిన మోడీ సర్కారుకి దేశంలోని రైతులు.. మరీ ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు చుక్కలు చూపించేశారు. ప్రజాగ్రహానికి ఏ ప్రభుత్వమైనా దిగి రావాల్సిందే.

రైతుల పోరాటానికి తలొగ్గిన మోడీ సర్కార్, కొత్త చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా, రైతు సంఘాలు మాత్రం.. ఇంకా మోడీ సర్కారుని నమ్మడంలేదు. కొత్త వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు, కనీస మద్దతు ధరపై స్పష్టత కోసం రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇదే విషయమై విపక్షాలూ రైతులతో గొంతు కలుపుతుండడం గమనార్హం.

వ్యవసాయానికి సంబంధించి మోడీ సర్కారు తేనెతుట్టెని కదిపేసింది. నిబద్ధతతో పోరాటం చేస్తే, ఏ అంశం మీద అయినా ప్రభుత్వాల్ని నిలదీయొచ్చనీ, ప్రభుత్వాలు దిగొచ్చేలా చేయొచ్చని రైతులు నిరూపించిన దరిమిలా, ముందు ముందు మోడీ సర్కారుకి అడుగడుగునా ఇబ్బందులు ప్రజా పోరాటాల ద్వారా వచ్చే అవకాశాల్లేకపోలేదు.

పెట్రో ధరల అంశం ఎటూ వుండనే వుంది. ఈ అంశంపై మోడీ సర్కార్, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే వున్నట్టుంది.