దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి గ్యాంగ్ రేప్ లో దోషులుగా తేలినవారిని వదిలిపెట్టమని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఈ ఘటన గురించి ప్రధాని తనతో మాట్లాడారనీ, దోషులెవరినీ వదిలిపెట్టొద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారని యోగి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు.
యోగి స్పందిస్తూ.. ’ఈ ఘటనకు కారకులు తప్పించుకోలేరు. దీనిపై ముగ్గురితో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టీం ఏడు రోజుల్లో విచారణ జరిపి నివేదికను అందజేస్తుంది. బాధితురాలికి త్వరితగతిన న్యాయం జరగడానికి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం..‘అని అన్నారు.
సెప్టెంబర్ 14న హత్రాస్ కు చెందిన దళిత యువతిపై ఉన్నతవర్గానికి చెందిన నలుగరు దుండగులు అత్యాచారం చేసి ఆపై అత్యంత అమానవీయంగా ఆమె గొంతును కోశారు. ఈ ఘటనలో ఆమె తలకు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. మంగళవారం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చనిపోయింది. కాగా, ఆమె మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లనీయలేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇక రాజకీయంగానూ ఈ కేసు పెద్ద దుమారం రేపుతున్నది. ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం యోగి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఇదే మాట అన్నారు.