మోడీ హైద్రాబాద్ పర్యటనతో టీఆర్ఎస్‌కి మేలు జరిగిందా.?

అదేంటీ, బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే, తెలంగాణ రాష్ట్ర సమితికి మోడీ హైద్రాబాద్ టూర్ లాభం చేకూర్చడమేంటి.? అంటే, అదంతే. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్‌లో జరిగాయి. ప్రధాని సహా, బీజేపీ జాతీయ నాయకులంతా హైద్రాబాద్ వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిపై నానా రకాల విమర్శలూ చేశారు.

అయితే, నరేంద్ర మోడీ మాత్రం ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ అన్నారే తప్ప, తెలంగాణ రాష్ట్ర సమితిని నేరుగా ఆయన విమర్శించలేదు. దాంతో, ‘కేసీయార్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నరేంద్ర మోడీ చప్పగా ప్రసంగాన్ని ముగించారు..’ అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులే కాదు, సాధారణ ప్రజానీకంలోనూ ఇదే అభిప్రాయం వుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ బీజేపీలో జోష్ వస్తుందని భావించిన చాలామంది బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఈ రకంగా బీజేపీ తమకు మేలు చేసిందన్న భావనలో గులాబీ పార్టీలో కొందరు నేతలూ ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

అయితే, మోడీ మౌనం వెనుక చాలా రాజకీయ వ్యూహాలు వుండి వుండొచ్చు. సమయం చూసి, తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తనదైన ముద్ర వేసేలా, మోడీ సహా అమిత్ షా, జేపీ నడ్డా ఓ నిఖార్సయిన వ్యూహం రచించే వుంటారు. మోడీ హుందాగా వ్యవహరించారంటూ, ఓ చర్చ జనంలో ఓ మోస్తరుగా మొదలైంది కూడా. అది తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద మైనస్.

కానీ, టీఆర్ఎస్ మాత్రం, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయి, తమకు మేలు జరిగిందనే భావనలో వుంది.