Modi Govt : శుభం పలకరా.. అంటే, పెళ్ళికూతురు డాష్.. అన్నాడట వెనకటికి ఒకడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా వైఎస్ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంటే, ఈ నిర్ణయానికి కేంద్రం గతంలో జారీ చేసిన ఆదేశాల కారనంగా ఆటంకాలు తప్పవని టీడీపీ అనుకూల మీడియా కొత్త పల్లవిని అందుకుంది.
దేశంలో జనగణన నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు మార్చరాదనీ, కొత్త జిల్లాల ఏర్పాటు చేయకూడదని గతంలో కేంద్రం పేర్కన్న మాట వాస్తవం. కానీ, జనగణన విషయమై తీవ్ర అయోమయం కనిపిస్తోంది. కేంద్రం ఎప్పుడు జనగణన చేపడుతుందో ఎవరికీ తెలియదు. కరోనా నేపథ్యంలో అంతా గందరగోళంగా తయారైంది.
కేంద్రం జనగణన చేపట్టేదాకా, రాష్ట్రాలు తమ పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకోకూడదంటే ఎలా.? నిజానికి, విభజన చట్టం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి వుంది. కానీ, కేంద్రం ఆ విభజన చట్టాన్ని తుంగలో తొక్కేసింది.
అటు కేంద్రమైనా, ఇటు రాష్ట్రాలైనా సమయానుకూలంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, పరిపాలనా వెసులుబాట్ల దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొత్త జిల్లాల విషయమై ఇలాగే నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై లేని అభ్యంతరాలు, ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో టీడీపీ అనుకూల మీడియాకి ఎందుకు కనిపిస్తున్నాయో ఏమో.!
అయితే, శాసన మండలి రద్దు సహా చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని కేంద్రం లైట్ తీసుకుంటోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా మోడీ సర్కారు, ఏపీ ఆలోచనలకు బ్రేక్ వేస్తుందా.? అంటే, వేసే అవకాశమైతే లేకపోలేదు.