వైఎస్ జగన్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నారా, మోదీ ఆయన్ను భుజానికెత్తుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్ జగన్ 22 మంది ఎంపీలను కలిగి ఉండటంతో ప్రధాని వద్ద ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. జగన్ వైఖరి సైతం మోదీని ఆకట్టుకుంటోంది. జగన్ ఎన్డీయేకు విపరీతమైన గౌరవం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కాబట్టి బీజేపీని గౌరవించి తీరాలని, వారి అండదండలు మనకు ఉండాల్సిందేనని, అలా జరగాలంటే వారిని నొప్పించకుండా ఉండాలని, వారి నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నట్టు జగన్ ఉంటున్నారు. అందుకే ఎన్డీయేకు ఎంపీల మద్దతు కావాల్సి వచ్చినప్పుడల్లా వెతుక్కుని మరీ వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో వైసీపీ చిన్న పార్టీయేమీ కాదు. పార్లమెంట్లో నాల్గవ అతిపెద్ద పార్టీగా ఉంది. పెద్ద పార్టీ అండదండలను ఊరికే ఎవ్వరూ వదులుకోరు. పైగా జగన్ ప్రధానిని పెద్దగా డిమాండ్ చేస్తున్నది ఏమీ లేదు. రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీలు కూడ ఒక్కోసారి పరిస్థితులను తారుమారు చేస్తుంటాయి. వాటి అవసరం జాతీయ పార్టీలకు చాలా అక్కరకు వస్తుంటుంది. ఆ సంధర్భాల్లో అవి పేట్టే షరతులు మామూలుగా ఉండవు. అర్హతకు మించి ప్రయోజనాలు ఆశిస్తుంటాయి. చేసేది లేక అప్పటికప్పుడు గండం నుండి తప్పుకోవడానికి జాతీయ పార్టీలు వారి డిమాండ్లకు తలూపుతుంటాయి.
ఇలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే వైసీపీ లాంటి జాతీయ పార్టీలను మచ్చిక చేసుకుని పక్కనపెట్టుకోవడం చాలా అవసరం. ప్రజెంట్ దక్షిణాది రాష్ట్రాల నుండి బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న ఏకైక అతిపెద్ద పార్టీ వైసీపీనే. కాబట్టి దక్షిణాదిలో బీజేపీ పనులు ఏవైనా జరగాలంటే జగన్ ఒక్కరే దిక్కు. ఇలా జగన్ మూలంగా మోదీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్లో ఏదైనా బిల్లు పాస్ చేయడానికి మెజారిటీ సమస్య వస్తే జగనే దిక్కు. అందుకే ఆయన్ను ఎన్డీయే కూటమిలో భాగస్వామిని చేసుకోవడానికి మోదీ ఎప్పుడూ సిద్దంగానే ఉన్నారు. ఇప్పటికే అనేక మార్లు సంకేతాలు కూడ ఇచ్చారు. జగన్ సై అనాలే కానీ ఢిల్లీ లెవల్లో ఆయన స్థాయి, ప్రాముఖ్యత మారిపోతాయి. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.