ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ నడుస్తుంది.. ఒకవైపు వైసీపి నాయకుల దూకుడు, మరో వైపు హిందువుల విషయంలో జరుగుతున్న రగడ.. ఇలా రోజుకో కొత్త రాజకీయ దుమారం చెలరేగుతుంది.. ఒక రకంగా తమ సొంత పార్టీ వారి నుండే సీయం జగన్‌కు తలనొప్పులు వస్తున్నాయట. మొన్నటికి మొన్న తిరుమలను దర్శించుకునే అన్య మతస్థుల విషయంలో వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మండుతున్న ప్రతిపక్షాలు, హిందువులు.. తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని హిందువుల దేవాలయాలలో విగ్రహాల ధ్వంసం అయితే, తిరిగి చేయిస్తున్నాం కదా ఏమవుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని బీజేపీ నాయకులు, ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు మండి పడుతున్నాయట..
ఇదివరకు ఏపీ మంత్రి కొడాలి నాని, టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, దేవినేని ఉమ వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ జనాలకు మంచి ఎంటర్‌టైనర్ అందించేవాడు.. కానీ ఈ మధ్య కాలంలో తన రూటును మార్చుకుని ప్రతి దానిలో తల దూరుస్తూ బిరుసుగా ప్రవర్తిస్తున్నాడు అనే విమర్శలు వస్తున్నాయి.. ఇక తాజాగా హిందూ దేవతలను, సంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. అంతర్వేది రథం తగలబెడితే, దుర్గ గుడిలో సింహాలు మాయమైతే, ఆంజనేయ స్వామి విగ్రహం చేయి విరగకొడితే పోయేదేమీ లేదా.. దాన్ని డబ్బుతో వెలకడతావా అంటూ ఘాటుగానే ప్రశ్నల వర్షం కురిపించారు..
ఇకపోతే అంతర్వేది వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవడం, ముఖ్యంగా హిందుత్వ విషయంలో బిజెపి బాగా టార్గెట్ చేయడం వంటి పరిణామాలతో జగన్ ప్రభుత్వం ఎక్కడలేని ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. అసలే హిందుత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీ హిందు ధర్మాన్ని కాపాడే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏపీలో హిందువుల పై, హిందు ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరోసారి కోడాలి నాని ఈ రకంగా మాట్లాడడం జగన్ కు తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తుంది. మంత్రి వ్యాఖ్యలను తప్పు పడుతూ, ప్రతిపక్షాలే కాకుండా ప్రజలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఇక పరిస్థితి చేయి దాటక ముందే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులను, పార్టీ నాయకులను కట్టడి చేస్తే మంచిది అనే అభిప్రాయాలు తలెత్తుతున్నాయట.