జడ్జిలు, కోర్టులు వైసీపీ లీడర్ల దృష్టిలో విలన్లు 

జడ్జిలు, కోర్టులు వైసీపీ లీడర్ల దృష్టిలో విలన్లు
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు గత కొన్నాళ్ళుగా తీవ్ర వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే.  ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేసే వైసీపీ లీడర్లు కొన్నాళ్ళుగా రాజ్యాంగబద్దమైన వ్యవస్థల మీద కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.  ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డను ప్రత్యేక పరిస్థితులు సృష్టించి మరీ పదవి నుండి తొలగించిన వైసీపీ ప్రభుత్వం చివరకు నాలుక కరుచుకున్న వైనం అందరం చూశాం.  అలాగే పంచాయతీ కార్యాలయాలకు రంగులు, డాక్టర్ సుధాకర్ వివాదం, నిర్భంధ ఇంగ్లీష్ విద్య, తాజాగా మూడు రాజధానుల బిల్లు మీద స్టే ఇలా పలు అంశాల్లో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి తలంటింది.  రంగుల విషయంలో మరీ పట్టుదలకు పోయిన సర్కారుకు గట్టిగానే అక్షింతలు పడ్డాయి.  ఒకానొక దశలో కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడతారా అంటూ కోర్టు కోపగించుకుంది. 
 
దీంతో వైసీపీ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  కోర్టులు, జడ్జిలు ఉద్దేశ్యపూర్వకంగానే తమకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయానికి వెళ్ళి తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు.  ఆమంచి, నందిగాం సురేష్ లాంటి నేతలు నేరుగా కోర్టులపై విమర్శలు గుప్పించారు.  సురేష్ అయితే కోర్టులు చంద్రబాబు చెప్పినట్టు వింటున్నాయని అన్నారు.  ఇక సోషల్ మీడియాలో అయితే వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు.  ఈ పరిణామం దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది.  హరీశ్ సాల్వే లాంటి ప్రముఖ న్యాయవాదులు ఇలా కోర్టులను నిందించడం సరైన పద్దతి కాదని కోపగించుకున్నారు.  ఊరుకుంటే లాభం లేదని న్యాయవాదులంతా కలిసి పరుష విమర్శలు చేసిన వైసీపీ నేతలు, మద్దతుదారులు ఇలా మొత్తం 49 మందికి నోటీసులు పంపారు.  ఇంత జరిగినా వైసీపీ నేతల్లో మార్పు వచ్చినట్టు కనబడలేదు.  
 
తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు కోర్టుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  తాను ఎమ్మెల్సీ అయిన సంధర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అమరావతి గురించి మాట్లాడుతూ చంద్రబాబు, కేసులు, జడ్జిలు సీఎం జగన్ వెంట్రుక కూడా కదపలేరని అన్నారు.  చంద్రబాబు వరకు ఈ హీరోయిక్ మాటలు బాగానే ఉంటాయి కానీ మధ్యలో కేసులు, జడ్జిలు ఏమీ చేయలేరని అంటూ మాట్లాడటమే విపరీతంగా ఉంది.  ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన ఆయనకు టికెట్ దొరకలేదు.  దీంతో జగన్ భవిష్యత్తులో పదవి ఉంటుందనే హామీ ఇచ్చారు.  ఆ హామీ మేరకే ఏడాది తర్వాత ఎమ్మెల్సీని చేశారు.  ఆ సంతోషం రవీంద్రబాబులో ఉండొచ్చు.  నమ్మి పార్టీ మారినందుకు, యేడాది ఎదురుచూసినందుకు పదవి ఇచ్చారనే కృతఙ్ఞత ఉండొచ్చు.  కానీ ఆ కృతఙ్ఞతను ప్రదర్శించడానికి, హీరో ఎలివేషన్ ఇచ్చి సీఎం మెప్పు పొందడానికి ఇలా జడ్జిలను కూడా విలన్లుగా ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడాటం మంచి పద్దతి అనిపించుకోదు.