ఏపీ సీయం వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తురాలు అయిన నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా వైసీపీలో చేరినప్పటి నుండి వైఎస్ జగన్ గెలుపు కోసం ఎంతగా శ్రమించారో అందరికి తెలిసిన విషయమే.. ఇక తాను ఏ పార్టీలో ఉన్నా తన వాయిస్‌తో ప్రత్యర్ధులకు దడ పుట్టించే రోజా వైసీపీలోకి చేరిన తర్వాత టీడీపీ నాయకులను చాలా టార్గెట్ చేసింది.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబును అయితే తన మాటలతో బెదరగొట్టింది.. ఇందుకు కారణం లేకపోలేదు.. అదేమంటే టీడీపీలో రోజా రాజకీయ భవిష్యత్తు ఎదగక పోవడానికి ఒకరకంగా చంద్రబాబు కారణం అనే ప్రచారం అప్పట్లో జరిగిందట..
ఆ విషయాన్ని గమనిస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చిన రెండు అవకాశాలు ఆమెకు ఇష్టం లేని చోటే ఇచ్చారట బాబుగారు.. మొదటి సారి 2004లో నగరిలో చెంగారెడ్డిపై నిలబెట్టి ఓడించారు. ఆ తర్వాత చంద్రగిరికి పంపి, గల్లా అరుణపై 2009లో ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పోటీ చేయించగా అక్కడ కూడా రోజా ఓడిపోయారు. దీంతో బాబు తీరుపట్ల విసిగిపోయిన రోజా వైసీపీలో చేరి ఎన్నో కష్టాలు పడి 2014లో నగరి నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2019లో రోజా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా గెలవడం.. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేకపోయినా వైఎస్ జగన్ ఆమెకు ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు.
ఇలా తన బలమైన వాయిస్సే ఆమెకు ప్లస్ అవగా ఈ వాయిస్‌తో చాలా మంది సీనియర్లను సైతం ఆమె వెనక్కు నెట్టేస్తూ తన రాజకీయ జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న రోజాకు పెద్దిరెడ్డితో ఎప్పటి నుంచో కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో రోజా కూడా పెద్దిరెడ్డిపై వీలున్నప్పుడల్లా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విమర్శిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇన్ని రోజులు ఒక ఎత్తు ఇప్పుడు ఒకేత్తులా రోజాలో అకస్మికంగా కలిగిన మార్పుకు అందరు ఆశ్చర్యపోతున్నారట..
అదేమంటే తాజాగా ఆమె పెద్దిరెడ్డితో పాటు ఆయన తనయుడు రాజంపేట ఎంపీ అయినా మిథున్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాలా ప్రశంసలు కురిపించడం.. దీంతో పాటు అదే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై విరుచుకుపడడం ఈ రెండు సంఘటనలు ప్రస్తుతం ఏపీలో హట్ టాపిక్‌గా మారాయట.. ఇందుకు కారణం కొద్ది రోజుల క్రితమే నారాయణ స్వామి రోజాకు చెప్పకుండా నగరిలో పర్యటించడం అని తెలుస్తుంది.. ఎంతైన రాజకీయం కదా.. దీన్ని వొంటబట్టించుకున్న రోజా తెరవెనక ఏం జరిగిందో తెలియదుగాని పెద్దిరెడ్డిని ప్రశంసిస్తూ నారాయణస్వామిని టార్గెట్ చేయడంతో వైసీపీలో మరో కొత్త రచ్చకు దారితీస్తుందేమో అని అనుకుంటున్నారట..