గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీలో తీవ్ర నైరాశ్యం నిండుకున్న సంగతి తెలిసిందే. ఓడిపోయిన నేతలు చాలామంది ఇక చేసేదేముంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారంటే ఓడిపోయిన బాధలో కుంగిపోయి ఉన్నారని అనుకుంటే గెలిచిన చోట్ల కూడా కొందరు నేతలు అలాగే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకు వైసీపీ నేతల దూకుడు ఒక కారణమైతే పార్టీలోని అంతర్గత కలహాలు మరొక రీజన్. ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి ఆదిరెడ్డి భవానీ విజయం సాధించారు. వైసీపీ హవాను తట్టుకుని మంచి మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా సంతృప్తి లేకుండా పోయిందట. కారణం పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలేనట.
టీడీపీ నుండి వైసీపీ కి ఆ తర్వాతా మళ్లీ టీడీపీలోకి వచ్చారామె. రీఎంట్రీ ఇచ్చి టికెట్ అయితే పొందగలిగారు కానీ చంద్రబాబు నుండి పూర్తిస్థాయిలో సహకారం కరువైందట. పైగా రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి, భవానీకి అస్సలు పొసగడం లేదట. పార్టీ కార్యకలాపాల్లో పరస్పర సహకారం లేదట. బుచ్చయ్య చౌదరి తన నియోజకవర్గ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటుండటం ఆమెకు అస్సలు నచ్చట్లేదట. ఈ విషయమై చంద్రబాబుకు పిర్యాధు చేసినా బుచ్చయ్య చౌదరి సీనియర్ లీడర్ కాబట్టి దిద్దుబాటు చర్యలు కరువయ్యాయి. ఇది అమెకు మరింత అసహనాన్ని తెప్పించిందట.
వీటికి తోడు గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భవానీ టీడీపీ తరపున చెల్లని రీతిలో ఓటు వేశారు. అవగాహన లోపం వలన అలా జరిగిందని ఎమ్మెల్యే అంటున్నా హైకమాండ్ దీన్ని తీవ్రంగానే పరిగణించింది. ఇక ఆదిరెడ్డి భవానీకి సమీప బంధువైన అచ్చెన్నాయుడు అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కాగా ఆయనకు పార్టీ నుండి సపోర్థ్ అందవలసిన స్థాయిలో అందలేదని భవానీ ఆమె భర్త అసహనంగా ఉన్నారట. ఈ పరిణామాలతో నియోజకవర్గంలో సిట్యుయేషన్ దారుణంగా తయారైందట. పార్టీ ప్రతిష్ట కి దెబ్బతింటోందట. ఇది గమనించిన చంద్రబాబుగారు సర్దుకుపోయి నియోజకవర్గంలో పార్టీని నిలబెట్టే దారి చూడాలని సూచన చేయగా ఎమ్మెల్యే మాత్రం అసంతృప్తిగానే ఉన్నారని, అధినేత సూచనలను పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.