నలభై వేల ఎకరాల్లో ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలని చంద్రబాబు కలలు కన్నారని, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో బాబును నమ్మి అక్కడ స్థలాలు కొన్న ఎన్నారైలు, భూవ్యాపారులు కోట్లలో నష్టపోయారని, చంద్రబాబు విపరీతంగా కష్టపడ్డారని కొందరు బోలెడంత సానుభూతిని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా ప్రస్తుతం రాజధాని పేరిట జరుగుతున్న ఉద్యమం రియల్ ఎస్టేట్ వ్యాపారులదే అని వారు బహిర్గతం చేస్తున్నారు.
వారు గ్రహించాల్సిన సత్యం ఏమిటంటే..చంద్రబాబు నిజంగా అన్ని కలలు కంటే నాలుగేళ్ల వ్యవధిలో కనీసం యాభై శాతం నిర్మాణాలైనా చేసి ఉండేవారు. ఈ లాండ్ పూలింగులు, అసమదీయులకు ఎకరాలకు ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టడం, నెలకో దేశపు కంపెనీని మార్చుతూ రాజధానిని గందరగోళంలో పడేసేవారు కారు.
మరొక విషయం ఏమిటంటే చంద్రబాబు అవినీతితో విసిగిపోయిన జపాన్ మాకీ కంపెనీవారు చంద్రబాబు మీద ఏకంగా కేంద్రప్రభుత్వానికి, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంఘం వారికి కూడా బాబు అవినీతి, కమీషన్ల వ్యవహారం మీద కూడా ఫిర్యాదు చేశారట. అప్పట్లో మోడీగారితో గాఢమైన మైత్రి ఉండటంతో మాకీవారి ఫిర్యాదును కేంద్రం పట్టించుకోలేదు.
ఇక ఆనాడు జగన్ అమరావతికి ఒప్పుకున్నాడని కొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే…అమరావతి వెనుక ఇన్ని కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయని ఆనాటికి ఇంకా బయటపడలేదు. ఆ తరువాతనే చంద్రబాబు పాలనా వైఖరిని చూసిన తరువాత అమరావతి నిర్మాణం అనేది ఒక భూవ్యాపారమే తప్ప ప్రజా రాజధాని కాదని అందరికీ అర్ధం అయింది. పైగా నవనగరాల పేరిట అమరావతి మొత్తాన్ని కోట్లాధిపతులకు మాత్రమే పరిమితం చెయ్యాలని చంద్రబాబు ప్రయత్నించారు. సామాన్య, మధ్యతరగాగి వారు ఎక్కడ నివసించాలి అనే ఊసే చంద్రబాబు ఎత్తలేదు.
అమరావతికి సుదూరప్రాంతాల్లో నివసించే బడాబడా రాజకీయ నాయకులు అమరావతిలో ఐదెకరాలు, ఆరెకరాలు కొనేయడంలో ఆంతర్యం ఏమిటి? రాజధాని ప్రాంతంలో నివాస స్థలం ఉండాలనుకోవడం తప్పా అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. తప్పేం లేదు. ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ఉన్నప్పుడు హైద్రాబాద్ లో వేలాదిమంది సీమాంధ్రులు నివాస స్థలాలు కొనుక్కున్నారు. భవంతులు నిర్మించుకున్నారు. కానీ వాటి విస్తీర్ణం ఎంత? వంద గజాలు, లేకపోతె వెయ్యి గజాలు. అంతేతప్ప జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, మణికొండ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎవరైనా అయిదారు ఎకరాలు కొన్నారా? అనంతపురం, కడప జిల్లా తెలుగుదేశం నాయకులు సైతం అమరావతిలో అయిదారు ఎకరాలు ఎందుకు కొన్నారు? ఈ కుంభకోణాలు అన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు. రాజధాని లీకులు ఇచ్చి కారుచౌకగా అక్కడి అమాయక రైతులు, దళితుల భూములను బ్రతిమాలో, భయపెట్టో కొనేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా?
ఇక చంద్రబాబు చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, ప్రజలు తనకు అధికారం ఇచ్చింది అయిదేళ్ల కాలానికి మాత్రమే. ఆ అయిదేళ్ల కాలంలోనే ఎంతో కొంత పనిచేసి చూపించాలి. కానీ చంద్రబాబు కలలు కన్న రెండు లక్షల కోట్ల రూపాయల రాజధాని కావాలంటే అది ఎన్ని దశాబ్దాలు పడుతుంది? చంద్రబాబుకు అంత ఆయుషు ఉన్నదా? ఒకవేళ తదుపరి ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని కొనసాగిస్తారా లేదా అన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు! అమరావతిలో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని, తాము అధికారంలోకి వస్తే దర్యాప్తు చేయిస్తామని 2017 నుంచే వైసిపి ప్రకటిస్తుంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేని విధంగా చకచకా రాజధాని భవనాలు నిర్మించాలనే కనీస స్పృహ కూడా చంద్రబాబు లో లోపించిందేమి? పైగా ఆయన కాలంలో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ తాత్కాలిక భవనాలు అని ప్రకటించారు. సుమారు రెండువేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన భవనాలు తాత్కాలికమేమిటి? జనం నవ్విపోరూ? ఎవరిని వెఱ్ఱివారిని చెయ్యాలని చంద్రబాబు ప్రయాస?
ఇక రాజధానిని నిర్మించడంలో తనకు అనుభవం ఉన్నదని స్వకుచమర్దనలు! ఆయనకు భజనలు చేస్తూ చంద్రబాబు అంత అనుభవజ్ఞుడు, ఇంత అనుభవజ్ఞుడు అంటూ ఎల్లో మీడియా ప్రతిరోజూ వాయించే చిడతలు! ఏమిటి చంద్రబాబు నిర్మించిన రాజధాని? ఎక్కడుంది? హైద్రాబాద్ లో మాదాపూర్ ప్రాంతంలో నిర్మించిన ఒక హైటెక్ సిటీ అనే బిల్డింగ్ చంద్రబాబు కట్టించింది! ఆ ప్రాంతానికి సైబరాబాద్ అనే నామకరణం చేసి అదేదో వేరే రాజధానిని నిర్మించినట్లు బిల్డప్. హైటెక్ సిటీని నిర్మించేముందే ఆయన తన కులస్తులకు లీకులు ఇచ్చి ఆ ప్రాంతంలో ఎకరం లక్షకో, రెండు లక్షలకు కొనేట్లు చేసారు. ఆ తరువాత అక్కడి భూములు కొన్నవారు వందలకోట్లు సంపాదించారు. వారి పేర్లు చాలామందికి తెలుసు. “మాదాపూర్ లో నేను ఎకరం లక్షకు కొని ఏడాది తరువాత కోటి రూపాయలకు అమ్మాను” అని చంద్రబాబే సగర్వంగా ప్రకటించారు. అదే కుతంత్రాన్ని అమరావతిలో కూడా చంద్రబాబు అమలు చేశారు.
కాకపొతే గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి రాకతో భూవ్యాపారుల ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. అక్కడ ఎన్నారైలు ఆడింది జూదమే తప్ప నిజాయితీ కలిగిన వ్యాపారం కాదు. వారు చంద్రబాబును నమ్ముకుని విదేశాల్లో తాము కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అమరావతిలో తగలేశారు. ఇది షేర్ మార్కెట్లో నష్టపోయినట్లే తప్ప మరొకటి కాదు.
జగన్ మీద ఆరోపణలు చేసేవారు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు అంత నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే గత ఎన్నికల్లో అంతటి దారుణ పరాజయాన్ని ఎందుకు చవిచూస్తారు అని! రాజధాని ప్రాంతంలో చంద్రబాబు కొడుకు లోకేష్ నాయుడు మంత్రి హోదాలో పోటీ చేసి ఎందుకు పరాభవించబడ్డాడు అనే లాజిక్ ను వారు గ్రహిస్తే చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఏమిటో వారికి అవగతం అవుతుంది. విదేశాల్లో రోజుకు పదిగంటలు కష్టించి పనిచేస్తూ అమరావతిలో జరిగిన వాస్తవ విషయాలు గ్రహించలేక, కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు మాత్రమే చదువుతూ చంద్రబాబు చేసిన తప్పిదాలకు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటున్నారు! నిజంగా చంద్రబాబు అమరావతి రాజధానిని ప్రజలు నమ్మితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఎలా వస్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు అత్యంత ఘోరావమానం ఎందుకు ఎదురైంది అని బుర్ర పెట్టి ఆలోచిస్తే చంద్రబాబు తన తప్పుడు విధానాలతో, మోసపూరిత వాగ్దానాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాక ఎన్నారైలను కూడా వంచించారనే చేదు నిజం వారికి బోధపడుతుంది. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల సిద్ధాంతాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని అర్ధం అవుతుంది.
క్షేత్రస్థాయి పరిస్థితులు ఈ విధంగా ఉండగా పచ్చ చానెళ్లు చూసి, జగన్మోహన్ రెడ్డి మీద వారు ప్రసారం చేసే విద్వేషపూరిత కథనాలను తిలకించి జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటే, శాపనార్ధాలు పెట్టుకుంటే నిష్ప్రయోజనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే చంద్రబాబు తీసిన గోతిలో అత్యాశకు పోయి భూవ్యాపారులంతా పడిపోయి ఇప్పుడు బాధపడుతున్నారు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు