‘రాజకీయాలకతీతంగా మీతో అనుబంధం మాకు ప్రత్యేకం..’ అని సెలవిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి. ‘అబ్బే, వైఎస్ జగన్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం గురించి..’ అంటూ వైసీపీ నేతలు బుకాయిస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ వేరు. 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ వేరు. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేత. ఇప్పుడాయన ముఖ్యమంత్రి. నిజానికి, ముఖ్యమంత్రి పదవిలో ఇంకాస్త డైనమిక్‌గా వుండాలి. కానీ, అత్యంత బలహీనుడిగా వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. బహిరంగ సభల్లో ‘రాసుకొచ్చిన స్క్రిప్టు’ చదవకుండా వైఎస్ జగన్ ప్రసంగించలేకపోతున్నారన్న విమర్శ గత కొంతకాలంగా వుంది. నిన్నటి విశాఖ సభలోనూ అదే జరిగింది. స్క్రిప్ట్ యధాతథంగా చదివేశారు. అది బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ అనుకోవాలా.? అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లోనే కనిపిస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించిన డైనమిక్ లీడర్ వైఎస్ జగన్. అదే ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేసిన ఘనుడాయన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేక హోదా పట్ల చైతన్యం పెంచి, ఆందోళనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘రేప్పొద్దున్న కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినాసరే.. శాసించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం..’ అని ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. ఇప్పుడేమో, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని మోడీకి గుర్తు చేస్తున్నామని అంటున్నారు. ఎంత తేడా.? సరే, ప్రధాని వచ్చిన అధికారిక కార్యక్రమంలో నిలదీయడానికి మొహమాట పడి వుండొచ్చు. కానీ, గడచిన మూడేళ్ళలో వైసీపీ తరఫున కేంద్రానికి నిలదీతలు ఏవీ.? పైగా, ఇప్పుడేమో ‘మీతో అనుబంధం రాజకీయాలకు అతీతం’ అంటారా.? ఎక్కడో తేడా కొడుతోంది.! ఔను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మారిపోయిన మనిషి.